రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ముందు వరసలో ఉన్న ఆక్వారంగానికి బాసటగా నిలిచే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఆక్వా హబ్‌ల ఏర్పాటు అంశం చాలాకాలంగా నానుతున్నప్పటికీ దానిపై ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి మంగళవారం ఓ స్పష్టత ఇవ్వడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆక్వాలో మొదటి నుంచీ జిల్లాలో రైతులు వినూత్న విధానాలతో విశేషంగా రాణిస్తున్నారు. సుమారు 1.80 లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యలు, పీతలు వంటివి సాగు చేస్తున్నారు. సుమారు రూ.100 కోట్ల విలువైన మత్స్య ఉత్పత్తులను రాబడుతున్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలోనూ సాగు వీడకుండా పోరాడుతున్నారు. ఈ దశలో ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు లభిస్తే ఊరటగా ఉంటుందని అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఈ ప్రకటనతో ఆశలు చిగురించాయి.
కష్ణా జిల్లాలో ఐదుచోట్ల ఆక్వా హబ్‌ల నిర్మాణానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా తొలుత పెనమలూరులో మోడల్ ఆక్వా హబ్ నిర్మాణాన్ని చేపట్టారు. అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దీనికి తోడుగా మచిలీపట్నం, జగ్గయ్యపేట, నూజివీడు, గుడివాడ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్లలో వీటి నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటి వరకు రొయ్యలు, చేపలు స్థానికంగా విక్రయాల కంటే ఇతర ప్రాంతాలకే ఎగుమతులు అవుతున్నాయి. స్థానిక మార్కెట్‌ను పెంపొందించడానికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి. ఒక్కో కేంద్రానికి అనుబంధంగా 120 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. సాగుదారులు, వ్యాపారుల ద్వారా కేంద్రాలకు తరలించిన సరకును ఈ దుకాణాలను సరఫరా చేస్తారు. వీటిద్వారా ప్రభుత్వ నిర్దేశించిన ధరలు రైతుకు లభించే అవకాశం ఉంటుంది. దళారుల వ్యవస్థను నివారించడానికి ఈ కేంద్రాలు ఉపయుక్తంగా ఉంటాయి.
సమీకృత ప్రయోగశాలలు
జిల్యావ్యాప్తంగా ఐదు నియోజకవర్గ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వీటిని రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానించి, నాణ్యమైన విత్తనం, మేత, మందుల సరఫరా, నాణ్యత పరీక్షలు చేస్తున్నారు. వీటి వినియోగంపై రైతులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి ల్యాబ్‌లు మరిన్ని ఏర్పాటు చేయాలని రైతులు చాలాకాలంగా కోరుతున్నారు. సీడ్, మేత, మందులు వంటివాటిలో నూరుశాతం నాణ్యత లభ్యమైతే నష్టాలను గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వ్యాధుల బారిన పడకుండా, మెరుగైన దిగుబడులు సాధించడం సాధ్యమవుతుంది.
ఆచరణలోకి వస్తే మేలే
ప్రస్తుతం ఆక్వారంగం ఒడుదొడుకుల్లో ఉంది. కొనుగోలు - విక్రయాలు, ధరల వంటి అంశాలు సక్రమంగా సాగడం లేదు. ఆక్వా హబ్‌ల ఏర్పాటు వల్ల స్థానిక మార్కెట్లు మెరుగుపడే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో వీటిని ఏర్పాటు చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు మరోసారి వీటిపై దృష్టి పెట్టడం మంచిదే. కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా వీలైనంత త్వరగా వాటిని ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకువస్తే రైతులకు మేలు జరుగుతుంది.