Farmers Suffering Unseasonal Rains: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా అన్నదాతలు అతలాకుతలమవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటను పండిస్తే.. చేతికి అందాల్సిన పంట కళ్లెదుటే నేలకొరగడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. వర్షంతోపాటు గాలి బీభత్సం సృష్టించడంతో మిర్చి, మొక్కజొన్న, మినుము, అరటి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయంటూ ఆవేదన చెందుతున్నారు. అప్పులు తెచ్చి పంటలు పండించిన తమను, తమ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోతే.. ఆత్మహత్యలే శరణ్యమని రైతన్నలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి తమను ఈ నష్టం నుంచి బయటపడేయాలంటూ వేడుకుంటున్నారు.
పంటంతా నీటిపాలు-రైతన్న కష్టాలపాలు: అహర్నిశలు కష్టపడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట.. నీటిపాలు కావడంతో నిండా మునిగిపోయామని అన్నదాతలు బావురుమంటున్నారు. భారీ వర్షాలకు తడిచిన వరి, మిరప తదితర పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. గతంలో మాదిరి ప్రభుత్వం పట్టాలను సైతం అందించకపోవడంతో పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు.
ఏలూరు జిల్లాలో వర్షాలు: అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి.. ఆరుగాలం శ్రమించిన అన్నదాతల్ని ఆకాల వర్షాలు ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు పొగాకు, నిమ్మ రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో.. ఏం చేయాలో తెలియడం లేదని వాపోతున్నారు. కష్టంతో పాటు పెట్టుబడి సైతం వర్షార్పణమైందని జంగారెడ్డిగూడెం డివిజన్ చిన్నంవారి గూడెం రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
రూ. 70వేల పెట్టుబడితో మొత్తం 5 ఎకరాల్లో చెరుకు పంటను పెట్టాను. రాత్రినక, పగలక కురిసిన వర్షం, గాలి వల్ల పంటంతా నేలకు వరిగింది. దాదాపు చెట్లన్నీ పాడైపోయాయి. ఏం చేయాలో అర్ధంకావటం లేదు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాము. -సూరిబాబు, రైతు