ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు సుందరవనం... నేడు కళావిహీనం

బెజవాడలో మొన్నటి వరకు హరిత కాంతులు వెదజల్లిన F1H20 ఉద్యానవనం ఇప్పుడు వెలవెలబోతోంది. పర్యవేక్షణ కొరవడి మొక్కలు ఎండిపోతున్నాయి. రాజధాని నగరంలో అంతర్జాతీయ స్థాయి బోట్ రేసింగ్ నిర్వహించిన సమయంలో లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన పార్కు ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతోంది.

పార్క్

By

Published : Aug 4, 2019, 9:02 AM IST

నాడు సుందరవనం... నేడు కళావిహీనం
విజయవాడ సుందరీకరణలో భాగంగా F1H20 బోట్ రేసింగ్​కు గుర్తుగా దుర్గగుడి పై వంతెన కింది భాగంలో గతేడాది ఈ పార్కును అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన వర్టికల్ గార్డెనింగ్​ను అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో బెజవాడకూ పరిచయం చేశారు. లక్షలాది రూపాయల ఖర్చుతో వివిధ రకాల ఆకర్షణీయమైన మొక్కలను తీసుకొచ్చి... గతేడాది నవంబర్​లో ఈ పార్కును ప్రారంభించారు. కొత్తలో విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు ఈ పార్కుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మొక్కల సంరక్షణ బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. కానీ ఈ పార్కు అందాలు మూన్నాళ్ల ముచ్చటగా తయారయ్యాయి.
F1H20 పార్కులో ఏర్పాటు చేసిన మొక్కల్లో సగానికి పైగా ఎండిపోయి ఖాళీ ప్లాస్టిక్ కుండీలు కనిపిస్తున్నాయి. అధికారులు సైతం పట్టించుకోవడం మానేయటంతో పార్కుకు వచ్చిన వారు చేతికందిన మొక్కను తీసుకెళ్లిపోవడం మొదలుపెట్టారు. ఐదు నెలల క్రితం అటుగా వెళ్లేవారికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించిన ఈ పార్కు... ఇప్పుడు చిన్నబోయి చూస్తోంది. ఎండిన మొక్కల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయకపోవటం...నిర్వహణను గాలికి వదిలేయటంతో వర్టికల్ గార్డెన్ కాస్తా అందవిహీనంగా తయారైందని స్థానికులు చెబుతున్నారు. ప్రజాధనాన్ని వెచ్చించి నగర సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ పార్కు ఇప్పుడు పట్టించుకునేవారు లేక వాడిపోతోంది.

ABOUT THE AUTHOR

...view details