ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారుల అలసత్వం...తిరుపతమ్మ ఆలయ ఆదాయానికి గండి - పెనుగంచిప్రోలు ఆలయం ఆదాయం న్యూస్

అధికారుల అలసత్వం కారణంగా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి ఆలయ ఆదాయానికి గండిపడుతోంది. వేలం లేకుండానే నామమాత్రపు రుసుములతో వ్యాపారాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. అధికారుల అనాలోచిత చర్యతో అమ్మవారి ఆలయానికి కోట్లల్లో నష్టం వాటిల్లుతోందని స్థానికులు మండిపడుతున్నారు.

తిరుపతమ్మ ఆలయ ఆదాయానికి గండి
తిరుపతమ్మ ఆలయ ఆదాయానికి గండి

By

Published : Nov 24, 2020, 4:27 PM IST

కృష్ణాజిల్లాలో విజయవాడ దుర్గ గుడి తర్వాతి స్థానంలో కొనసాగుతున్న పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవాలయంలో అధికారుల అనాలోచిత నిర్ణయాలు ఆలయానికి గండి కొడుతున్నాయి. కళ్లెదుటే లక్షల ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులు తన్నుకు పోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. లాక్​డౌన్ తర్వాత తిరిగి తెరుచుకున్న ఆలయంలో పలు రకాల వ్యాపారాల నిర్వహణపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఆలయానికి ఓ మోస్తరుగా భక్తుల రాక మొదలైంది. కానీ ఆలయం వద్ద వేలం ద్వారా వ్యాపారాలు దక్కించుకున్న గుత్తేదారులు దుకాణాలు తెరిచేందుకు ముందుకు రాలేదు. వారితో పలుమార్లు ఆలయ అధికారులు చర్చలు జరిపారు. లాక్​డౌన్ కాలంలో తాము వ్యాపారాలు చేయనందున గడువు పెంచాలని గుత్తేదారులు డిమాండ్ చేశారు. దీనిపై ఆలయ ఈవో రాష్ట్ర దేవాదాయ కమిషనర్​కు నివేదించారు. ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవటం వల్ల వ్యాపారాలు స్తంభించిపోయాయి. భక్తులు సమర్పించే తలనీలాలు, వస్త్రాలను దేవస్థానం ఆధ్వర్యంలో స్వీకరించి భద్రపరుస్తున్నారు.

నామమాత్రపు రుసుములకే విలువైన వ్యాపారాలు అప్పగింత

కొబ్బరికాయలు, నిమ్మకాయలు, ఇతర పూజా ద్రవ్యాల విక్రయాలతో పాటు క్యాంటీన్, పొంగలి షెడ్డు, వాహనాల పార్కింగ్ వంటి ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు రోజువారి రుసుములు చెల్లించి నిర్వహించుకునేలా ఆలయ అధికారులు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. వీటిలో ఖరీదైన కొబ్బరికాయలు, నిమ్మకాయల విక్రయాలు, పొంగలి షెడ్డు, వాహనాల పార్కింగ్ వ్యాపారాలకు సంబంధించి రుసుములు వసూలు చేస్తున్న విషయంలో అధికారుల వద్ద స్పష్టత కరువైంది. మొదట్లో రోజుకు రెండు వేలు, భక్తులు అధికంగా ఉండే శుక్ర, ఆదివారాల్లో నాలుగు వేలు అని చెప్పిన అధికారులు...ఆ తర్వాత మాట మార్చి రోజుకు రూ. 500 శుక్ర, ఆదివారాల్లో ఏడు వేలు వస్తోందని అని చెబుతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు వ్యాపారాలు అప్పగించే విషయంలో గతంలో మాదిరి అధికారులు ఎక్కడ బహిరంగంగా వేలం నిర్వహించలేదు. గోప్యంగా దుకాణాలు అప్పగించటం పట్ల స్థానికులు అధికారుల తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమ్మవారి దేవాలయానికి కోట్లలో నష్టం వాటిల్లుతుందని వారు ఆరోపిస్తున్నారు.

తిరిగి వేలం పాట నిర్వహిస్తాం

గతంలో జరిగిన వేలం పాటలో వ్యాపారాలు దక్కించుకున్న గుత్తేదారులు లాక్ డౌన్ తర్వాత వ్యాపారాలు చేసేందుకు ముందుకు రాలేదు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు వారికి అప్పగించాము. వారి నుంచి రుసుములు పక్కాగా వసూలు చేస్తున్నాము. అయితే వీటిపై స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని తిరిగి వేలం పాటలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం.

- ఎన్​.వీ.ఎస్.ఎన్.మూర్తి, ఆలయ ఈవో

ఇదీచదవండి

తెలుగు వైద్యుడికి బ్రిటన్​ ఉన్నత పురస్కారం

ABOUT THE AUTHOR

...view details