employees struggle : ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ లను నియంత్రించే అధికారం గవర్నర్ కే ఉందని.., ఆయన పేరు మీద ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శించారు. అందుకే తాము గవర్నర్ ను కలిసి తమ బాధలు చెప్పుకున్నామన్నారు. కృష్ణా జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టం చేయడం ద్వారానే ఉద్యోగుల సొమ్ముకు భద్రత ఉంటుంది కాబట్టి విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. శాసన సభ్యులు చట్టం చేయాలని.., వారిని కలిస్తే తమకు రాజకీయాలను ఆపాదిస్తారనే కలవలేదన్నారు. గవర్నర్ ను కలవడం ఏరకంగా నేరం అవుతుందో తమకు నోటీసు ఇచ్చిన ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. అవసరమైతే 371 డి అధికరణ ద్వారా రాష్ట్రపతి ని కలుస్తామని గతంలో ఓ సందర్భంలో చెప్పానని గుర్తు చేశారు.
ఆఖరి రూపాయి చెల్లించే వరకూ.. ఉద్యోగికి ప్రభుత్వం బాకీ పడిన ఆఖరి రూపాయి చెల్లించే వరకూ తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. తమ ఉద్యమం ఎలా ఉండాలనేది.. త్వరలోనే ఓ సమావేశం పెట్టి కార్యాచరణ నిర్ణయిస్తామని వెల్లడించారు. నాయకత్వం మాత్రమే సొంత ఎజెండాతో ముందుకు వెళ్లదని.., విరమించాల్సి వచ్చినా.. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని తేల్చిచెప్పారు. సీనియర్ ఉద్యోగ సంఘం నాయకుడిగా వ్యక్తిగత ప్రతిష్టలకు ఎవరూ పోవద్దని కోరుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులంతా ఆందోళనకు దిగడం అనివార్యమని.., నాయకులంతా ఐక్యంగా ముందుకు వస్తే మంచిదన్నారు. ఉద్యోగులంతా ఆందోళనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం కేవలం తమ సంఘాన్నే చర్చలలో ఉండకూడదని ఎందుకు కోరుకుంటోందని ప్రశ్నించారు. సంఘాలకు అతీతంగా ఉద్యోగులంతా ఉద్యమంలో ఉంటారని బలంగా నమ్ముతున్నామన్నారు.
తాడోపేడో తేల్చుకునే విధంగా... ఏప్రిల్ మూడో వారంలో మొదలుపెట్టే ఉద్యమం తాడో పేడో తేల్చుకునే విధంగా ఉంటుందని సూర్యనారాయణ స్పష్టం చేశారు. అందరినీ సమాయాత్తం చేసి... రాజమండ్రి వేదికగా తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం ఉద్యోగులకు చేస్తున్న మోసాలను కూడా వివరిస్తామని చెప్పారు. తమకు రావాల్సిన అన్నిరకాల ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు, భవిష్యత్ చెల్లింపులకు చట్టబద్ధత.., రాజకీయ పరంగా ఉద్యోగులకు ఇచ్చిన అనేక హామీలను పూర్తిగా అమలు చేయాలనేదే తమ డిమాండ్లు అని స్పష్టం చేశారు.