అటవీ ప్రాంతంలో కొందరు పొలాల్లోకి అడవి జంతువులు రాకుండా అనధికారికంగా విద్యుత్తు తీగలు వేస్తున్నారు. వీటివల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సముద్రతీర ప్రాంతంలో ఆక్వా సాగు ఎక్కువగా జరుగుతోంది. చెరువుల్లో ఏరియేటర్లు తిప్పడానికి విద్యుత్తు అవసరం. విద్యుత్తు స్తంభాల నుంచి చెరువు గట్లపై వందల మీటర్ల దూరం తీగలు తీసుకెళతారు. కొన్నాళ్లకు విద్యుత్తు తీగలపై ఉన్న తొడుగు వివిధ కారణాలతో అక్కడక్కడ పాడవుతుంది. గట్లపై పనులు చేసే క్రమంలో విద్యుత్తు తీగలు తగిలి కూలీలు, రైతులు ప్రమాదాలకు గురవుతున్నారు. పొలాల్లో బోరుబావులు, పంపుసెట్ల వద్ద తీగలు సరిచేయడం, విద్యుత్తు స్తంభం నుంచి స్టార్టరు పెట్టెకు కనెక్షన్లు ఇవ్వడం వంటివి చేస్తుంటారు.
స్తంభాల నుంచి లాగిన తీగలు తెగిపోవడం, వాటిని రైతులే స్వయంగా జత చేసుకోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మొత్తం సంఘటనలు పరిశీలిస్తే వ్యవసాయ బోర్ల వద్ద చనిపోయేవారే ఎక్కువగా ఉంటున్నారు. కొన్నిసార్లు ప్రకృతి విపత్తుల వల్ల విద్యుత్తు తీగలు తెగిపడి ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో స్థానికంగా ఎలక్ట్రికల్ పనులు చేసుకునేవారు విద్యుత్తు నియంత్రికల ఫ్యూజులు సరిచేయడం, మరమ్మతు చేసే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయమై సీపీడీసీఎల్ సీఎండీ పద్మాజనార్దన్‌రెడ్డి ‘ఈనాడు’తో మాట్లాడుతూ విద్యుత్తు అధికారుల అనుమతి లేకుండా ప్రైవేటు వ్యక్తులు విద్యుత్తు స్తంభాలపై అవగాహన లేమితో మరమ్మతు చేయడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఇలాంటి వారిని గుర్తించి అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. రైతులు, వినియోగదారులకు సమస్య వస్తే సమీపంలోని విద్యుత్తు సిబ్బందికి తెలియజేస్తే పరిష్కరిస్తారు. అన్ని వార్డు, గ్రామ సచివాలయల్లో విద్యుత్తు సిబ్బంది నంబర్లు అందుబాటులో ఉంటాయి. 1912 నెంబరుకు కాల్ చేసి సమస్య చెబితే పరిష్కరిస్తామన్నారు.
బాధితులకు పరిహారం