కృష్ణా జిల్లాలోని దివిసీమలో నిర్మించనున్న క్షిపణి పరీక్షా కేంద్రానికి అనుమతులు లభించాయి. ఇటీవల హరిత ట్రైబ్యునల్ షరతులతో కూడిన అనుమతులిచ్చింది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ రెండో దశ అనుమతులు మంజూరు చేసింది. త్వరలోనే 386 ఎకరాల భూమి డీఆర్‌డీవో చేతికి రానుంది. కొంతమేర స్థలాన్ని క్షిపణి పరీక్షా కేంద్ర నిర్మాణానికి వినియోగించనున్నారు. మిగిలిన స్థలంలో మడ అడవులు పెంచాలనే యోచనలో డీఆర్‌డీవో ఉంది.
క్షిపణి పరిక్షా కేంద్రానికి లైన్ క్లియర్... షరతులు వర్తిస్తాయి రూ.2300 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు మొదలవుతాయి. 2012లో అనేక ప్రాంతాలను పరిశీలించిన అధికారులు... గుల్లలమోద అనుకూలమైనదిగా తేల్చారు.
2012లో గుల్లలమోదలో 386 ఎకరాలను గుర్తించారు.
2017లో రక్షణ శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు.
2017లో తొలిదశ అనుమతి లభించింది.
2018 లో ఈ ప్రాంతాన్ని సీఆర్‌జడ్ నుంచి మినహాయిస్తూ... కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
2019లో రెండోదశ అనుమతుల మంజూరు చేశారు.
మొదట క్షిపణి పరీక్షా కేంద్రం నిర్మాణానికి రెండు, మూడు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం దివిసీమ సముద్ర తీరప్రాంతంలోని గుల్లలమోద గ్రామం అనువుగా ఉంటుందని గుర్తించారు. తీరప్రాంతంలో అయితే క్షిపణి పరీక్షలు సముద్రంలోకి పంపవచ్చు. హైదరాద్ డీఆర్డీవోలో తయారుచేసిన మిస్సైల్స్‌ను దివిసీమలో పరీక్షించొచ్చు.
అటవీ భూములు కావడం వల్ల అనుమతులకు 8 ఏళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో డీఆర్‌డీవోకు రెండో దశ అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు షరతులు విధించింది. అటవీ ప్రాంతం కావడంతో ఎక్కడా... జీవావరణం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అనుమతి పత్రంలో పేర్కొంది.
షరతులు...
1.మడఅడవుల్లో జీవావరణం, అంతరించిపోతున్న జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లకుండా నిర్మాణాలు చేపట్టాలి.
2.అభయారణ్యం పరిధిలో కేవలం పగటిపూట మాత్రమే తమ కార్యకలాపాలు సాగించాలి.రాత్రి పూట పూర్తిగా ఆపేయాల్సి ఉంటుంది.
3.డివిజనల్ అటవీ శాఖ అధికారి ఏటా తనిఖీ చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలి.
ఈ ప్రాంతంలో నిర్మాణాలు ప్రారంభమైతే స్థానికులకు ఉపాధి లభిస్తుంది. సుమారు 300 మంది శాస్త్రవేత్తలు, సిబ్బంది నివాసం ఉండనున్నారు. అవనిగడ్డ ప్రాంతంలో సిబ్బంది నివాస భవనాలు నిర్మించనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో రెండెకరాల స్థలాన్ని అతిథిగృహాల కోసం కేటాయించారు. క్షిపణి పరీక్షా కేంద్రానికి భారీ కంటైనర్లు రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారుల విస్తరణ జరుగుతుంది. ఈ ప్రాంతం ఆర్థికంగా వృద్ధి చెందుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సమీపంలోని పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి... విచారణకు రావాలి..!