ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్ డౌన్: ఆమె 'డౌన్' కావొద్దు! - అమ్మ

కాఫీ, టీ కావాలంటూ గంటకోసారి భర్త హుకుం జారీ చేస్తుంటాడు. రకరకాల ఫలహారాలు చేసి పెట్టాలని అడుగుతూ పిల్లలు మారాం చేస్తుంటారు. లాక్ డౌన్ వేళ అమ్మకు.. ఇలా అదనపు బాధ్యతలు వచ్చి పడుతున్ననాయి. ఔను మరి.. ఆఫీసుకెళ్లాల్సిన భర్త వర్క్ ఫ్రం హోం అంటూ ఇంట్లోనే ఉంటున్నాడు. బడిలో ఉండాల్సిన పిల్లలు ఇల్లు పీకి పందిరేస్తున్నారు. సందట్లో సడేమిలా కరోనా సాకుతో పనిమనిషి డుమ్మా కొట్టింది. అందుకే అమ్మ పని భారంగా మారింది. నిస్వార్ధంగా సేవ చేసే ఇల్లాలు తీరిక లేక అలసిపోతోంది. కష్ట సమయంలో అమ్మకు, ఆలికి గుదిబండ కాకుండా మనం నడుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

amaravathi
లాక్ డౌన్: ఆమె డౌన్ కావొద్దు

By

Published : Apr 6, 2020, 9:48 AM IST

కరోనా ఆంక్షల వేళ వర్క్ ఫ్రం హోం అని కొందరు.. స్కూళ్లకు సెలవులు ఇవ్వటంతో పిల్లలు.. ఇలా అందరు ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇక ఇంట్లో ఉంటే అడిగినవన్నీ చేసి పెట్టటానికి అమ్మ ఉంది. ఇల్లాలు ఉంది. అలాంటి మహిళలకు లాక్ డౌన్ ఆంక్షలు వర్తించవు. వాళ్లకు సెలవులంటూ ఉండవు. పని మనిషి రాకుంటే.. ఇంటి బాధ్యతంతా.. అదనపు బాధ్యతలతో సహా ఆ ఇల్లాలిదే. పొద్దున బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీలు, స్నాక్స్, రాత్రి డిన్నర్.. ఇవి కాక ఇంటి పని.. దీనికి తగ్గట్లు మనకు రకరకాల కోరికలొకటి. ఏది కావాలన్నా అయితే అమ్మకో.. కాదంటే ఆలికో చెప్పాల్సిందే.

అమ్మకు.. ఆలికీ.. సాయపడండిలా..

మహిళలు ఇంటి పని చేస్తున్న తీరును పురుషులు అర్థం చేసుకోవాలి. వారికి బ్రేకులిస్తూ.. సహాయపడుతుండాలి. చేదోడు వాదోడుగా ఉంటూ.. లాక్ డౌన్ సమయాన్ని వాళ్లు కూడా విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగించాలి. అబ్బాయిలకూ ఇది అమోఘమైన అవకాశమే. చిన్న చిన్న పనుల్లో సాయం పడుతుంటే నా కొడుకు చెట్టంత ఎదిగాడనీ, చేతికి అందివచ్చాడని అమ్మ ఎంతో సంబరపడిపోతుంది. ఆ అవకాశం వదులుకోకుండా.. ఒడిసి పట్టుకోవడమే తెలివిగల యువకుల లక్షణం మరి.

అమ్మాయిలూ.. మీకూ ఇది ముఖ్యమే

అమ్మాయిలూ టీవీలు చూడటం ఆపండి. చదువుల్లోనూ కాస్త విశ్రాంతి తీసుకోండి. కాసేపు వంట గదిలో దూరండి. హుషారుగా కూరగాయలు తరగండి. అమ్మ కరిగిపోయి తన ప్రేమను చూపించేయడం ఖాయం. ఈ లాక్ డౌన్ సమయం.. మీరు వంటల్లో నిపుణులయ్యేందుకు పనికొస్తుంది. అమ్మ దగ్గరే ఉంటూ.. బాగా నేర్చేసుకోండి.

పిల్లలు...

ఇంట్లో మరీ చిన్న పిల్లలుంటే కాసేపు వారి ఆలనాపాలన చూడటం, అల్లరి అదుపు చేయటంవంటి బాధ్యతలు భర్త తలెకెత్తుకోవాల్సిందే. ఆఫీసులో బాస్ చీవాట్లు పెట్టినప్పుడు ఆవేశాన్ని అణుచుకునే సీన్ గుర్తుకు తెచ్చుకుంటే పిల్లల్ని కట్టడి చేయటం ఏమంత కష్టం కాదు. వాళ్ల బుర్రకు పని చెప్పే ఆటపాటల వైపు దృష్టి మళ్లించాలి. కథలు, పుస్తకాలు చదటం, డ్రాయింగ్ వంటివి నేర్పించటం.. ఇలాంటివి చేయిస్తుంటే ఇల్లాలికి కచ్చితంగా భారం తగ్గుతుంది.

ఒడిశా ముఖ్యమంత్రి సందేశం

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు అమ్మ ప్రేమ విలువ బాగా తెలుసు. అందుకే ఈ లాక్ డౌన్ సమయంలో తీరికలేని పనులతో ఉండే ఇల్లాలి పై మరింత పని భారం వేయొద్దు అని సూచించారు.

ఈ మాత్రం సహకారం ఉంటే మన అమ్మ, భార్య, అక్కాచెల్లీ మనకోసం ఎన్ని పనులు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.

ఇదీ చూడండి:

అసలు ఏమిటీ తబ్లీగీ జమాత్‌? వీటి లక్ష్యాలేంటి?

ABOUT THE AUTHOR

...view details