బెల్లంకొండ శ్రీనివాస్ అమెరికా సహా వివిధ దేశాల్లో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పని చేశారు. ఏడాదిన్నర క్రితం సొంతూరు వచ్చి ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ఓ సాఫ్ట్వేర్ సంస్థ ప్రారంభించారు. అందులోనూ సంతృప్తి లేక పాడి రైతుగా మారి... రియల్ మిల్క్ బ్రాండ్ ప్రారంభించారు. ఇప్పుడు అదే పేరుతో పుస్తకాలు, ఆటవస్తువులు అద్దెకిస్తూ విజయవాడ ప్రజల దృష్టిని ఆకర్షించారు.
తనకు ఎదురైన అనుభవమే..!
ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే చాలు ఆటవస్తువుల కోసం గొడవే. పిల్లలు మారాం చేస్తున్నారు కదా అని కొనిస్తే...వారం రోజుల్లో పాడు చేసి మూలన పడేస్తారు. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే పుస్తకాలు, చరిత్ర తెలిపే పుస్తకాలు వేల సంఖ్యలో కనిపిస్తాయి. సరేలే అని కొన్నా చదువుతారా లేదో తెలియదు. ఇలాంటి సమస్య నుంచి పుట్టిందే ఈ సరికొత్త వ్యాపార సూత్రం. పుస్తకాల కోసమని పది వేలు కావాలన్న కుమారుడి అభ్యర్థనతో ఆలోచనలో పడ్డారు శ్రీనివాస్. ఇది తనకు పెద్ద మొత్తం కాకపోయినా మధ్యతరగతి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని లోలోపలే మథనపడ్డారు. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. ఓ గ్రంథాలయాన్ని ప్రారంభించి... పిల్లల కోసం పుస్తకాలు, బొమ్మలు అద్దెకివ్వాలని నిర్ణయించుకున్నారు.