ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Diarrhea: బల్లిపర్రులో విజృంభిస్తున్న డయేరియా... వారంలో ఇద్దరు మృతి

Diarrhea: బల్లిపర్రు గ్రామంలో డయేరియా ప్రబలుతోంది. వారంలో ఇద్దరు మృతి చెందారని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. డయేరియాతో 21 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు వైద్యశిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.

Diarrhea
బల్లిపర్రు గ్రామంలో డయేరియా

By

Published : May 2, 2022, 6:58 AM IST

Updated : May 2, 2022, 12:34 PM IST

Diarrhea: కృష్ణాజిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో అతిసారం విజృంభిస్తోంది. వారం రోజుల్లో ఇద్దరు మృతి చెందారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన ముగ్గురికి వాంతులు, విరోచనాలు ప్రారంభమై దాదాపు 21 మందికి సోకింది. వారంతా పామర్రులోని ప్రైవేటు వైద్యశాలలు, ఆర్‌ఎంపీ వైద్యుల వద్ద చికిత్స పొందగా పలువురు కోలుకొని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కలపాల అలివేలమ్మ(65), కొడాలి హెప్సిభ(50)కు ఆరోగ్యం విషమించగా శనివారం రాత్రి గుర్తించిన ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు మెరుగైన చికిత్స అవసరమని సూచించారు. దీంతో అలివేలమ్మను కుటుంబీకులు ఆదివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతిచెందింది. హెప్సిభ విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇదిలా ఉండగా కలపాల కవిత(36), కలపాల ప్రసాద్‌(38), కలపాల కుమార్‌(52), కలపాల పాండు(67), కలపాల అంజియ్య(42), జుఝువరపు ఉదయ్‌(12), కలపాల హని(13) ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోలుకున్న వారిలో కొందరు ఒక్కొక్కరు రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీరు కలుషితమే కారణమా!:కాలనీ వాసులకు మంచినీటి ట్యాంకు నుంచి నీరు సరఫరా అవుతుండగా మంచినీటి పైప్‌ లైన్లకు లీకులు ఉండటంతో ప్రజలకు సరఫరా అయ్యే నీరు కలుషితమవ్వడం వల్లే అతిసారం రావడానికి కారణమని పలువురు చెబుతున్నారు. డ్రెనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ పాలకవర్గం, అధికారుల నుంచి సరైన స్పందన కరవైందని ఆందోళన చెందుతున్నారు. మొక్కుబడిగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారని.. ఇన్ని రోజులుగా అతిసారం వ్యాప్తి చెందుతుంటే ఆదివారం పంచాయతీ వారు బ్లీచింగ్‌ చల్లిస్తున్నారని, పైప్‌లైన్ల లీకులను గుర్తిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

డయేరియాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా వెంటనే చికిత్స అందించి.. డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


ఇదీ చదవండి: రాష్ట్రంలో సూర్యుడి భగభగలు ... ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలు

Last Updated : May 2, 2022, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details