రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొల్లపూడి బాలిక ద్వారక హత్య కేసులో నిందితుడికి విజయవాడ కోర్టు మరణశిక్ష విధించటంపై... డీజీపి గౌతమ్ సవాంగ్ స్పందించారు. 2019 నవంబర్ 10న గొల్లపూడిలో ఏడేళ్ల బాలికపై హత్యాచారం జరిగింది. ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష విదిస్తూ... ఐదవ అదనపు జిల్లా, స్పెషల్ జడ్జి తీర్పును వెల్లడించింది. మహిళలు, చిన్నారులపైన జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించిన కేసులలో నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఏర్పాటు చేసిన దిశ చట్టం ఈ కేసులో ఉపయోగపడిందని డీజీపీ అన్నారు. భవానీపురం పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 24 గంటల్లోనే నిందితుడు బార్లాపుడి పెంటయ్యను అరెస్టు చేశారు. పోలీసుల ఫోరెన్సిక్ దర్యాప్తు , డీఎన్ఏ విశ్లేషణ ప్రాసిక్యూషన్ కు ఉపయోగపడ్డాయన్నారు.
దిశ చట్టం ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు 18కేసుల్లో నిందితులకు శిక్ష పడిందన్నారు. నేరం చేసిన నిందితులకు తప్పకుండా శిక్ష పడేవిధంగా చూస్తామని డీజీపీ స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.