కరోనా..ఈ పేరు వినగానే ఇప్పుడు అందరూ వణికిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవాలంటే.. రోగ నిరోధక శక్తి పెంచుకోవటమే ప్రత్యామ్నాయ మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ సి, విటమిన్ డి, జింక్ ఔషధాలు వినియోగించ వచ్చని వైద్యులు చెబుతున్నారు. దీంతో కృష్ణా జిల్లాలో ఈ మందులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.
గతంలో ప్రతిరోజు 10 మంది వీటి కోసం వచ్చే వాళ్లని.. ఇప్పుడు 100 మందిలో 60 మంది విటమిన్ సి,డి, జింక్ ఔషధాలను కొనుగోలు చేస్తున్నారని మెడికల్ షాపుల వారు చెప్తున్నారు. ప్రస్తుతం డిమాండుకు తగ్గ సప్లయ్ ఉందంటున్నారు. మరోవైపు రోగనిరోధక శక్తి నిచ్చే ఔషధాలతో పాటు పల్స్ ఆక్సీ మీటర్స్, మినీ ఆక్సిజన్ సిలిండర్స్ కు సైతం డిమాండ్ పెరిగింది. గతంలో 50 పల్స్ ఆక్సీమీటర్లు విక్రయించిన ఒక దుకాణంలో 500 విక్రయిస్తున్నామని యజమానులు చెప్తున్నారు.