కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలంలోని కోసురువారిపాలెం, నాగాయతిప్ప, మోపిదేవిలంక, ఉత్తర చిరువోలు లంక గ్రామాలు, చల్లపల్లి మండలం నడకుదురు గ్రామాల్లో సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తారు. సారవంతమైన నేలలు ఉండటం, భూగర్బ జలాలు పుష్కలంగా ఉండటంతో సుమారు 10 వేల ఎకరాల్లో కూరగాయలు సాగవుతాయి. టమాటా, దొండ, వంగ, బెండ, కాకర, సొర, బొప్పాయి, క్యాబేజీ, పచ్చిమిర్చి, అరటి, కంద, పసుపు పంటలు పండిస్తారు. పండించిన పంటను విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ మార్కెట్లకు, రైతు బజార్లకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. అలానే టమాటా, పచ్చిమిర్చి వంటివాటిని చెన్నై, ముంబయి, హైదరాబాద్ నగరాలకు ఎగుమతి చేస్తారు.
లాక్ డౌన్ రైతులను ముంచింది
కరోనా మహమ్మారి అంతా తలకిందులు చేసింది. లాక్ డౌన్ కారణంగా రవాణా లేక ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానికంగానూ మార్కెట్ లేక పండిన పంటను నదిలో పారబోస్తున్నారు రైతన్నలు. మరికొందరు పొలంలోనే దున్నేస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వారాంతపు సంతలు జరిగేవి. చాలామంది అక్కడకు వచ్చి కూరగాయలు కొనుగోలు చేసేవారు. లాక్ డౌన్ కారణంగా అవీ మూతబడ్డాయి.
కూరగాయలు వదిలేసి వాణిజ్య పంటలవైపు చూపు