కృష్ణా జిల్లా అవనిగడ్డలో స్నేహితుల మధ్య ఏర్పడిన వివాదంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని.. నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అవనిగడ్డ 3వ వార్డుకు చెందిన మెండు సూర్యకుమార్ కొద్దిరోజుల పాటు కొరియర్ బాయ్‌గా పని చేయగా.. ఆటో కిస్తీకి సంబంధించి తన మిత్రులతో వివాదం ఏర్పడింది. మాటా మాటా పెరిగి గత నెలలో ఘర్షణ జరగగా ఇరువురి పెద్దలు రాజీకుదిర్చారు. తరువాత కూడా మిత్రులు ఎగతాళి చేస్తూ ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురై.. సదరు యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్య కుమార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అవనిగడ్డ న్యాయమూర్తి జీవీఎల్ సరస్వతి.. ఆసుపత్రికి వచ్చి సూర్యకుమార్ దగ్గర వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని పోలీసులు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేస్తున్నట్లు అవనిగడ్డ సీఐ భీమేశ్వర రవికుమార్ తెలిపారు. ఘటనపై సూర్యకుమార్ బంధువుల నుంచి ఫిర్యాదు నమోదు చేసుకున్నామని.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.