Polavaram guide bund damaged : పోలవరం ప్రాజెక్టులో రూ.81 కోట్లు వెచ్చించి నిర్మించిన గైడ్‌బండ్ ఏడాదైనా కాకుండానే కుంగిపోయింది. వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు, జలాశయంలో నీటి నిల్వకు వీలుగా నిర్మించిన స్పిల్‌వే రక్షణ కోసం గైడ్‌బండ్ కట్టారు. గోదావరికి భారీ వరదొచ్చినప్పుడు ప్రవాహ వేగం వల్ల స్పిల్‌వేలో ఒకవైపే ఒత్తిడి పెరగకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ కం గైడ్ బండ్... కుంగిపోయి ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడటం ఇంజినీరింగ్ వర్గాలను విస్మయపరుస్తోంది. గైడ్‌బండ్ నిర్మాణానికి డిజైన్‌లోనే లోపం ఉండాలని లేదా డిజైన్‌కు తగ్గట్టుగా నిర్మించకపోవడమైనా అయ్యుండాలని అంటున్నారు. గైడ్‌బండ్ డిజైన్ రూపకల్పన, దాని ప్రకారం నిర్మాణం మేఘా ఇంజినీరింగ్ కంపెనీనే చేసినందున... లోపమేదైనా ఆ సంస్థదే అవుతుందంటున్నారు.
కుంగిన గైడ్‌బండ్ స్థానంలో మళ్లీ మొదటి నుంచి నిర్మించాల్సి వస్తుందని ఇంజినీర్లు చెబుతుంటే.. సీఎం జగన్ మాత్రం ఇదో చిన్న అంశమని తేల్చిపారేయడం విస్మయం కలిగిస్తోంది. బుధవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం... గైడ్‌వాల్‌లో చిన్న సమస్యను విపత్తులా చూపించే దౌర్భగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర జలసంఘం ఆమోదించిన డిజైన్ల ప్రకారమే పనులు చేసినట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్నచిన్న సమస్యలు వస్తాయని... వాటిని గమనించుకుంటూ, మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకొచ్చారు. కీలక స్పిల్‌వే రక్షణకు ఉద్దేశించిన కట్టడం కుంగిపోతే... చిన్న సమస్యగా సీఎం పరిగణించడం గమనార్హం. సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు.
భిన్నమైన ప్రాజెక్టు నిర్మాణం... సీఎం జగన్ అన్నట్లు గైడ్‌బండ్ చిన్న పనో లేదా చిన్న కట్టడం కాదని నిపుణులు అంటున్నారు. ప్రాజెక్టు కీలక నిర్మాణాల్లో ఇదొకటని... పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే భిన్నమైనదని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికేస్పిల్‌వేతో పాటు, గోదావరి సహజ మార్గంలో 44 మీటర్ల ఎత్తున ఎగువ కాఫర్ డ్యాం నిర్మించారు. దీంతో నది సహజమార్గం నుంచి అప్రోచ్ ఛానల్, స్పిల్‌వే వైపుగా వరద మళ్లుతోంది. ప్రవాహ తీరును పరిశీలించిన పరిశోధన సంస్థలు... స్పిల్‌వేలో ఎడమ ఫ్లాంకు వైపునకు నీటివేగం ఎక్కువగా ఉన్నట్లు తేల్చాయి. ఇక్కడ సుడిగుండాలు ఏర్పడి ప్రతికూల ప్రభావం చూపవచ్చని గుర్తించారు. దీన్ని నిరోధించేందుకు పుణెలోని కేంద్ర జల, విద్యుత్తు పరిశోధన సంస్థ నిపుణులు ప్రాజెక్టు త్రీడీ నమూనా రూపొందించి అధ్యయనం చేశారు. స్పిల్‌వే ఎడమ వైపున వరద సమయంలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయని, ఎడమ ఫ్లాంకు వైపున సెకనుకు 13.6 మీటర్ల వేగంతో ప్రవాహం ఉందని గుర్తించారు.
స్పిల్‌వే మధ్యలో వేగం సెకనుకు 9.2 మీటర్లుగా ఉండటం ప్రమాదకరమని తేల్చారు. ఇక్కడ ప్రతికూలత లేకుండా వరద సాఫీగా సాగిపోయేందుకు పలు సిఫార్సులు చేశారు. గోదావరిని మళ్లించే అప్రోచ్ ఛానల్ మౌత్ వద్ద 450 మీటర్ల వెడల్పు తవ్విన మార్గాన్ని 550 నుంచి 660 మీటర్ల వరకు పెంచాలన్నారు. స్పిల్‌వే ఎడమ వైపునకు ఎగువన, అప్రోచ్ ఛానల్ ఎడమ వైపున 500 మీటర్ల మేర గైడ్‌బండ్ నిర్మించాలని సూచించారు. గైడ్‌బండ్ నిర్మిస్తే స్పిల్‌వే ఎడమ ఫ్లాంక్ వైపు భారీ సుడిగుండాలు నివారించవచ్చని, ప్రవాహ వేగం తగ్గుతుందని పరిశోధనల్లో తేలినట్లు కేంద్ర జలవిద్యుత్తు పరిశోధన కేంద్రం నివేదికల్లో పేర్కొంది. గైడ్‌బండ్ నిర్మించి అప్రోచ్ ఛానల్‌లో మార్పులు చేస్తే వరద వేగం ఎడమ ఫ్లాంకు వైపున సెకనుకు 4 మీటర్లు, మధ్యలో 5.5 మీటర్లకు తగ్గుతుందని తేల్చారు. అంటే.. పోలవరంలో స్పిల్‌వే రక్షణకు గైడ్‌బండే కీలక నిర్మాణం. అందుకే ఈ నిర్మాణానికి 81 కోట్ల రూపాయలు వెచ్చించారు.
1.5మీటర్ల మందంతో డయా ఫ్రం వాల్ నిర్మాణం...గైడ్‌బండ్‌పై కేంద్ర జల విద్యుత్తు పరిశోధన కేంద్రం సిఫార్సుల తర్వాత... మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఆకృతులు సిద్ధం చేయించింది. సీడబ్ల్యూసీ ఆమోదంతో నిర్మాణం చేపట్టింది. వరద ప్రవాహం వైపున 1.5 మీటర్ల మందంతో ఆర్సీసీ డయాఫ్రం వాల్ నిర్మించారు. మైనస్ 5 మీటర్ల నుంచి +25 మీటర్ల ఎత్తు వరకు దీనిని కట్టడం నిర్మించారు. అంటే 500 మీటర్ల పొడవున నది ప్రవాహం ఉండే వైపున... భూగర్భంలో నుంచి ఎగువన 25 మీటర్ల ఎత్తు వరకు నిర్మించారు. ఆపైన +23.68 మీటర్ల స్థాయి నుంచి +51.32 మీటర్ల వరకు రాళ్లతో గైడ్‌బండ్ పూర్తిచేశారు. దిగువన 117.28 మీటర్లు, ఎగువన 6 మీటర్ల వెడల్పు ఉంటుంది. డిజైన్లకు ముందు భూభౌతిక పరిస్థితులతో పాటు నిర్మాణ సమయంలో చేసిన పరీక్షలన్నింటిలో అంచనాల మేరకే ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. ఐనా ఎందుకు కుంగిందో అధికారులు నోరు మెదపడం లేదు.