మోదీ, అమిత్‌షాపై చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు - action
మోదీ, అమిత్‌షాలు ఎన్నికల నిమయావళిని ఉల్లంఘించారని చంద్రబాబు ఆరోపించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని దిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు.
మోదీ, అమిత్‌షాలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వారివురూ ఎన్నికల నియమావళి ఉల్లఘించారని ఆరోపించారు. లోక్‌సభ ఏడో విడత ఎన్నికల ప్రచారం తుదిరోజైన 17న మోదీ, అమిత్‌షా కలిసి మీడియా సమావేశం నిర్వహించి బెట్టింగ్ గురించి ప్రస్తావిస్తూ చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అంతేకాక నిన్న కేదార్నాథ్, బద్రీనాథ్‌లో పర్యటించిన మోదీ... అనధికార కార్యకలాపాలు నిర్వహించారని మండిపడ్డారు. గుహల్లో యోగా చేయడం, కొన్ని ప్రాంతాల్లో నడవడం వంటివి అన్ని ఛానళ్లో ప్రసారమయ్యాయని.... ఇవి ఓ మత ప్రజలను ఆకర్షించేలా ఉన్నాయని ఆరోపించారు. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌ను ప్రకటించి ఎన్నికల నియమావళి ఉల్లఘించారని ఆరోపించారు. ఇవాళ తుది దశ ఎన్నికల జరుగుతున్నప్పటికీ మోదీ పర్యటనలు అన్నీ ఛానళ్లలో టెలికాస్ట్ అవుతున్నాయని.. ఇది ప్రజలను ఆకర్షించే యత్నమని దుయ్యబట్టారు. అలాగే ఈసీ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అశోక్ లావాసా సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా మోదీ, అమిత్‌షాలకు క్లీన్ చీట్ ఇవ్వడమేంటని అన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం మోదీ, అమిత్‌షాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.