ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan: 'సచివాలయాలను డిసెంబరు నుంచి సందర్శిస్తా' - cm jagan video conference

‘డిసెంబరు నుంచి గ్రామ, వార్డు సచివాలయాల సందర్శనకు వస్తా. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు వారానికి నాలుగింటిని సందర్శించాలని చెబుతాం. ప్రతి పర్యటనలో నేనూ సచివాలయాలను చూస్తా. తనిఖీల విషయంలో అలసత్వం వహించే వారిపై చర్యలకూ వెనుకాడం’ అని ముఖ్యమంత్రి జగన్‌ హెచ్చరించారు. ‘స్పందన’పై కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం బుధవారం వీడియో సమావేశంలో సమీక్షించారు. సచివాలయాలు ఎలా పనిచేస్తున్నాయో చూడకపోతే పరిపాలన మెరుగుపడదని, మీరు ఎంతమేర సందర్శిస్తే అంతగా మెరుగు పడుతుందని పేర్కొన్నారు.

CM Jagan Video Conference
CM Jagan Video Conference

By

Published : Sep 22, 2021, 5:03 PM IST

Updated : Sep 23, 2021, 3:57 AM IST

కలెక్టర్లు వారానికి రెండింటిని, జేసీలు, సబ్‌కలెక్టర్లు, పురపాలక కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు వారానికి నాలుగు సచివాలయాలను తనిఖీ చేయాలని ఆయన ఆదేశించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో ప్రజలందరికీ రెండు డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే 10రోజుల్లో 26,37,794 మందికి సెకండ్‌ డోసు వ్యాక్సిన్‌ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుంటూరు, విజయనగరం, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ‘రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తయ్యే వరకూ నిర్లక్ష్యం వద్దు. కొవిడ్‌ నిబంధనలను ఉల్లఘిస్తే కఠినంగా వ్యవహరించాలి. జరిమానాలు విధించాలి. థర్డ్‌వేవ్‌ వస్తుందో... లేదో తెలియదు. అప్రమత్తంగా ఉండాలి. బోధనాసుపత్రులకు జాయింట్‌ కలెక్టర్‌ (హౌసింగ్‌)ను అడ్మిన్‌ ఇన్‌ఛార్జిగా నియమించాలి. 104 నంబర్‌ అనేది ఒన్‌స్టాప్‌ సొల్యూషన్‌గా ప్రాధాన్యమివ్వాలి. నవంబరు 15 నుంచి అన్ని ఆసుపత్రుల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. డిప్యుటేషన్లు పూర్తిగా రద్దు చేయాలి....’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఎక్కడ సిబ్బంది లేకపోయినా ఆరోగ్యశాఖ కార్యదర్శిని, కలెక్టర్లను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. అక్టోబరు 10 కల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 143 ప్రాంతాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటవుతాయని చెప్పారు.

పెండింగ్‌ కేసులపై దృష్టి పెట్టాలి

‘ఇళ్ల పట్టాల పంపిణీపై కోర్టుల్లో పెండింగ్‌ కేసులపై దృష్టి పెట్టాలి. గత సమావేశంలో 834 కేసులు ఉంటే అవి 758కి తగ్గాయి. ఏజీతో నేను కూడా రెగ్యులర్‌గా మాట్లాడుతున్నా. వచ్చే నెల రోజుల్లో కేసులన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నా’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ‘ఇదివరకే ఉన్న లే అవుట్లలో 45,600 మందికి, ప్రభుత్వ లే అవుట్లలో 10,851 మందికి డిసెంబరులో పట్టాలు అందించాలి. మరో 1,48,398 మందికి ఇవ్వడానికి భూసేకరణ చేయాలి. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో డిసెంబర్‌ 21వ తేదీన రిజిస్ట్రేషన్‌ చేసిన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. పేదలందరికీ ఇళ్ల పథకంలో అక్టోబరు 25 నుంచి ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాలి. జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్పుల్లో అదనంగా 812 ఎకరాలను సిద్ధం చేయాలి...’ అని సీఎం జగన్‌ చెప్పారు.

ఇ-క్రాపింగ్‌ను తనిఖీ చేయాలి

‘కలెక్టర్లు, జేసీలు 10శాతం, జేడీ, డీడీలు 20 శాతం, వ్యవసాయ, ఉద్యాన అధికారులు 30శాతం ఇ-క్రాపింగ్‌ను తనిఖీ చేయాలి. ఎస్పీలు, కలెక్టర్లు ప్రతి వారం సమావేశమై ప్రైవేట్‌ వ్యాపారులు నాణ్యమైన విత్తనాలు అమ్ముతున్నారా? ధరలు అదుపులో ఉన్నాయా? ఎరువులు ఉన్నాయా? ఆర్‌బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? రైతులకు సేవలు అందుతున్నాయా? అన్నది పరిశీలన చేయాలి’ అని సీఎం జగన్‌ ఆదేశించారు. ‘ఇప్పటివరకూ 70,00,520 మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇది చాలా అద్భుతమైన సంఖ్య. గత ప్రభుత్వ హయాంలో ఛార్జిషీట్‌ వేయడానికి సగటున 300 రోజులు పడితే...ఇప్పుడు 40 రోజుల్లో వేస్తున్నాం. దేశంలో మహిళల మీద జరిగే నేరాల్లో 90 శాతం కేసుల్లో కేవలం రెండు నెలల వ్యవధిలో ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. రాష్ట్ర పోలీసు విభాగం అద్భుతంగా పని చేస్తోంది. నా అభినందనలు’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

తీసుకున్న నిర్ణయాలివి...
*దసరా (విజయదశమి) సందర్భంగా అక్టోబరు 7 నుంచి 17 వరకూ ఆసరా పథకం మండలం యూనిట్‌గా దశల వారీగా అమలు.
* క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌.. ‘క్లాప్‌’ అక్టోబరు 1న ప్రారంభం, 19న జగనన్న తోడు, 26న రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా రెండో విడత అమలు చేయాలి.

కలెక్టర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు సీఎం జగన్‌ కృతజ్ఞతలు

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో కలెక్టర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, జిల్లా యంత్రాంగం మెరుగైన పనితీరు ప్రదర్శించడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. ఇలాంటి ఫలితాలు 2024లోనే కాకుండా.. భవిష్యత్తులో కూడా కొనసాగుతాయన్నారు. ‘జిల్లాల్లో చక్కని పాలన ప్రభుత్వ పనితీరును ప్రతిబింబిస్తుంది. ప్రతి పథకాన్ని ప్రజల ముంగిటకు చేరుస్తున్నాం. దీన్ని కొనసాగిస్తూ ఇతర చోట్ల ఉన్న అవినీతిని కూడా ఏరిపారేయాలి. అక్కడ మంచి వ్యవస్థ, సుపరిపాలన తీసుకురావాల్సిన అవసరం ఉంది...’ అని సీఎం జగన్‌ చెప్పారు.

ఇదీ చదవండి

CMRF Scam: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో కుంభకోణం..!

Last Updated : Sep 23, 2021, 3:57 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details