రాష్ట్రంలో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ల అమలుకు వీలుగా.. మానవ వనరుల్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో పరిశ్రమల శాఖ మంత్రి, ఏపీఐఐసీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 ఇంజనీరింగ్ కళాశాలలను గుర్తించి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక రిజర్వేషన్లతో పాటు, పారిశ్రామిక ప్రగతి కోసం కార్యచరణ రూపొందించాల్సిందిగా అధికారులను కోరారు.
పెట్టుబడుల కోసం కొత్త నినాదం
పోర్టులు, ఎయిర్ పోర్టులు, మెట్రో రైలు, ఎలక్ట్రిక్ బస్సులు తదితర ప్రాజెక్టులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్న ముఖ్యమంత్రి జగన్... గ్లోబల్ టెండర్ల ద్వారా పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్రానికి కొత్త నినాదం తీసుకురావాలని సూచించారు. ఇజ్రాయిల్లో డీ-శాలినేషన్ ప్లాంట్ల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోందని.. 1 రూపాయికే 25 లీటర్ల తాగునీటిని అందిస్తున్నారని చెప్పారు. ఆ దిశగా కార్యాచరణ అమలు చేయాలని సూచించారు.
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ముందు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు జగన్ సూచించారు. ఫార్మా కంపెనీల వ్యర్థాలను తక్కువ మొత్తంలోనే శుద్ధి చేస్తున్నారని, అటువంటి చర్యలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలన్నారు. పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు 2 వేల కోట్ల రూపాయల మేర పెండింగులో ఉన్నాయన్న సీఎం... 2015-16 నుంచి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్‌లు ఇవ్వలేదని స్పష్టంచేశారు.