విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రప్రభుత్వం 5 వేల కోట్ల పెట్టుబడి మాత్రమే పెట్టిందని... 22 వేల ఎకరాల సువిశాల భూమి రైతుల త్యాగ ఫలితమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆయన కార్మిక, కర్షక, విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలతో కలిసి ఉక్కు పరిరక్షణ పోరాట వేదికను ఏర్పాటు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడమే ప్రధాన ధ్యేయంగా ఈ వేదిక పని చేయనుందని ఉమామహేశ్వరరావు తెలిపారు.
అధికార, ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమాశాల్లో రాష్ట్ర ఎంపీలు కలిసి కట్టుగా.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవాలన్నారు. ఫిబ్రవరి 14న గుంటూరు నుంచి బైక్ ర్యాలీ... 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపటనున్నట్లు వెల్లడించారు. కడపలో కూడా ప్రభుత్వమే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.