Chandrababu Road Show at Gudivada : తులసి వనం లాంటి ఆంధ్రప్రదేశ్లో గంజాయి మొక్కలు పెరిగిపోతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రమంతటా గంజాయి సంస్కృతి విస్తరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే ఎవ్వరికీ భవిష్యత్ ఉండదని అన్నారు. టీడీపీ అధినేత కృష్ణా జిల్లాలో చేపట్టిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. చంద్రబాబు గుడివాడలో పాల్గొన్న రోడ్ షోలో జనసేన, జై భీమ్ శ్రేణుల సందడి కనిపించిది. జనసేన నేతలు ఆ పార్టీ జెండాలతో సందడి చేశారు. అంతేకాకుండా జై భీమ్ పార్టీ నాయకులు తమ పార్టీల జెండాలు ఊపుతూ మద్దతు తెలిపారు. గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లో చంద్రబాబుకు టీడీపీ పార్టీ శ్రేణులు, నేతలు ఘనంగా స్వాగతం పలికారు. క్రేన్ సహాయంతో భారీ గజమాలతో ఆయనను సత్కరించారు. అనంతరం హనుమాన్ జంక్షన్లోని అంజనేయ స్వామి వారి ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర బిడ్డల, భవిష్యత్ కోసమే తన పోరాటమన్న ఆయన.. భవిష్యత్ తరాల కోసం కలిసి పోరాడేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
గుడివాడ నుంచి నూజివీడుకు : గుడివాడ హనుమాన్ జంక్షన్ గుండా రోడ్ షో ద్వారా ముందుకు కదిలారు. రోడ్ షోలో భారీగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు. అక్కడి నుంచి ముందుకు సాగిన టీడీపీ అధినేత.. నూజివీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సభలో ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి గన్నవరం బయల్దేరనున్నారు. నేటితో చంద్రబాబు తలపెట్టిన మూడు రోజుల కృష్ణా జిల్లా పర్యటన ముగియనుంది.