రాజధాని ప్రాంత ప్రజలెవరూ అధైర్యపడొద్దని... ఆవేదనతో చనిపోరాదని... వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధైర్యం చెప్పారు. శాసనసభ సమావేశాల సందర్భంగా ఈసారి తామెన్నో కష్టాలు ఎదుర్కొన్నామని, గతంలో అనేక సమావేశాలు జరిగినా.. ఎప్పుడూ ఇన్ని దౌర్జన్యాలు జరగలేదని చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లు, పాములపాడు, మోతడక, నిడుముక్కల, దామరపల్లి బడేపురం, తాడికొండ మహిళలు రాజధాని సమస్యపై చంద్రబాబు వద్ద వాపోయారు.
మంగళగిరి మండలం ఆత్మకూరులోని ఎన్టీఆర్ భవన్‌లో... చంద్రబాబును కలిసి రాజధాని ప్రాంత ప్రజలు తమ కష్టాలు వివరించారు. తమ భవిష్యత్తు ఎంతో అందంగా ఉంటుందని భావించామని... ఇప్పుడంతా అంధకారం అయ్యిందని విద్యార్థినిలు వాపోయారు. ఇళ్లలో ఉండే ఆడపిల్లలు రోడ్డెక్కే దుస్థితి కల్పించారని... భూమి ఇచ్చిన రైతులు అవమానాల పాలయ్యారని చంద్రబాబు ఆవేదన చెందారు. ఇలా మహిళలు, రైతులు కన్నీళ్లు పెట్టడం 40 ఏళ్లలో తానెప్పుడూ చూడలేదన్నారు. 84 ఏళ్ల వృద్ధుడైన ప్రసాద్.. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు.