ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​ అడ్డుపెట్టుకుని వైకాపా అవినీతికి పాల్పడింది: చంద్రబాబు - తెదేపా అధినేత చంద్రబాబు వార్తలు

ఫ్యాన్​కి ఓటేస్తే భవిష్యత్తు ఉంటుందని నమ్మిన వాళ్లకి ఇంట్లో ఫ్యాన్ వేసుకోలేని పరిస్థితి తెచ్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వేలల్లో వస్తున్న విద్యుత్ బిల్లులు చూసి ప్రజలు షాక్ కి గురవుతున్నారన్నారు. చేసిన మోసానికి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా 21వ తేదీన తెలుగుదేశం నేతలు చేసే దీక్షలకు ప్రజల కూడా తమ ఇళ్ల వద్ద నుంచే నిరసనలు తెలుపుతూ మద్దతు పలకాలని కోరారు.

ప్రభుత్వ చర్యలపై చంద్రబాబు మండిపాటు
ప్రభుత్వ చర్యలపై చంద్రబాబు మండిపాటు

By

Published : May 20, 2020, 1:52 PM IST

Updated : May 20, 2020, 10:39 PM IST

వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

వైకాపా ప్రభుత్వానికి ఓటేయటం ప్రజల దౌర్భాగ్యంగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు వేలల్లో వస్తున్న విద్యుత్ బిల్లులు చూసి ప్రజలు షాక్ కి గురవుతున్నారని మండిపడ్డారు. అసత్యాలు, అబద్దాలు చెప్పటంలో జగన్ సిద్ధహస్తులని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీలు పెంచలేదని బుకాయిస్తూ శ్లాబ్ లు మార్చి భారం మోపటం పెద్ద మోసమని దీనికి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వస్తూనే పీపీఏలమీద పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ తీవ్రవాదం ఉందని నిపుణులు మాట్లాడుకునే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. ఏపీ బీహార్​ని మించిపోతుందని అంతా ఆందోళన చెందుతున్నారన్నారు. వైకాపా ప్రభుత్వ నిర్వాకం వల్ల దేశంలోని విద్యుత్ రంగం ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు.. వచ్చేది తమ ప్రభుత్వమేనని... పేదలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేశామని తెలిపారు. ఉపాధిలేక, పూటగడవటం కష్టంగా మారిన తరుణంలో పేదల జీవితాలతో ఆడుకోవటం సరికాదని హితవుపలికారు. రాష్ట్రానికి తానే మొదటి ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి అన్నట్లు జగన్ తీరుందని ధ్వజమెత్తారు.

ఇలాంటి సమయంలో పేదల జీవితాలతో ఆడుకోవడం సరికాదు

గోదావరి మిగులు జలాలు అడగనని ఆనాడు వై.ఎస్. రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్న చంద్రబాబు... ఇప్పుడు రాష్ట్ర హక్కుల విషయంలో జగన్ అదేరీతిలో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ భూభాగంపై నీటిని తరలించటం రాష్ట్ర భవిష్యత్తుకు మంచిదికాదని ముందే చెప్పామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మొదటిరోజే జగన్ ఆశీస్సులు ఇచ్చారని విమర్శించారు. నీటిపారుదల రంగానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఏడాది కాలంలో జగన్ ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదని విమర్శించారు. పోతిరెడ్డిపాడును ఎన్టీఆర్ చేపడితే తాను పూర్తిచేశానని గుర్తుచేశారు. తాము చేపట్టిన పట్టిసీమ ద్వారా రాయలసీమకు ఎంతో లబ్ధి చేకూరిందని వెల్లడించారు.

మిగులు జలాలపై చంద్రబాబు

డబ్బులకు కక్కుర్తిపడి నాసిరకం మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టారని చంద్రబాబు ఆక్షేపించారు. రాష్ట్రంలో అందరికీ కరోనా వస్తుందని సీఎం చెప్పటం చేతకాని తనమేనన్న ఆయన.. ఎవ్వరూ చేయని తప్పుడు పనులు చేస్తున్నారని ఆరోపించారు. నియంత్రణ చేతకాక అందరికీ కరోనా రప్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారా అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి తిక్క సమాచారంతో మద్యం దుకాణాలు తెరవటం వల్లే కరోనా వేగంగా వ్యాప్తి చెందిందని ఆరోపించారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాలవద్ద డ్యూటీవేసి టీచర్ వృత్తిని తీవ్రంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి ప్రజల జీవితాలతో ఆడుకుంటారా అని దుయ్యబట్టారు. ప్రజలను హింసపెడితే మంచిది కాదని హితవుపలికారు. వైకాపా నేతలకు లాక్​డౌన్ నిబంధనలు పట్టవా అని మండిపడ్డారు. బిల్డ్ ఏపీ పేరుతో భూముల అమ్మకాలు సోల్డ్ ఏపీనేనన్న ఆయన... చట్టాన్ని గౌరవించకుండా ఉల్లంఘించి ప్రజలముందు అపహాస్యం పాలవుతున్నారన్నారు. ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేలోపే ప్రజలు మేల్కొనాలని పిలుపునిచ్చారు. జరుగుతున్న అన్యాయంపై తెలుగుదేశం గట్టిగా పోరాడుతుందన్న చంద్రబాబు..., ప్రజలు ధైర్యంగా ముందుకు రావాలని కోరారు.

వైకాపా ప్రభుత్వం లాక్​డౌన్​ను అడ్డం పెట్టుకుని అనేక విధాలుగా అవినీతికి పాల్పడిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. మడ అడవులను నాశనం చేయడం, సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తే కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రాజకీయపక్షాలు పేదలను ఆదుకునేందుకు 5వేల రూపాలయలు ఇవ్వాలని డిమాండ్ చేసినా ప్రభుత్వానికి మనస్సురాలేదని విమర్శించారు. మాస్కులు అడిగిన వైద్యుడికి పిచ్చోడి ముద్ర వేశారని మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన నుంచి అనేక సంఘటనల్లో ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్నీ చేశారని దుయ్యబట్టారు. కరోనా కట్టడిపై దృష్టిపెట్టకుండా ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టి ఎదురుదాడికి దిగారని ఆక్షేపించారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. వలస కార్మికుల ఇబ్బందులు వర్ణణాతీతమన్న ఆయన..., వేల కిలోమీటర్ల కాలినడక బాధాకరమన్నారు. హృదయవిదారకర సంఘటనలు చూశామని, మానవత్వంతో ఆదుకోవాల్సిన సమయంలో ఆదుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆర్థికంగా అనేక రంగాలవారు చితికిపోయారని చంద్రబాబు విచారం వ్యక్తంచేశారు.

మాస్కులు అడిగిన వైద్యుడిపై పిచ్చోడి ముద్ర వేశారు

ఎల్జీపాలిమర్స్ కు బ్రహ్మానందరెడ్డి హయాంలో ఇచ్చిన అనుమతులను తానిచ్చానని ముఖ్యమంత్రి అనటం ఆయన అవివేకమని చంద్రబాబు మండిపడ్డారు. ఎందుకు అసత్యాలు మాట్లాడుతూ తప్పుడు సమాచారం చెప్పి బతకాలనుకుంటున్నారని ఆక్షేపించారు. జగన్ మాటలకు విశ్వసనీయత ఎక్కడుందన్న ఆయన..., కోడికత్తి వ్యవహారం, చిన్నాన్న వివేక హత్య కేసులో తమపై చేసిన ఆరోపణలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. నోరుంది, అధికారం ఉందికదా అని ఏదిపడితే అది మాట్లాడటం సీఎంకు తగదని హితవుపలికారు. విశాఖ తన మనస్సుకు దగ్గరగా ఉండే నగరమని, ఎల్జీపాలిమర్స్ ఘటన నుంచి ఎప్పుడెప్పుడు విశాఖ వెళ్లాలా అని ఉందని చంద్రబాబు వెల్లడించారు.

ఇవీ చదవండి

ఎల్‌జీ పాలిమర్స్‌’పై చిన్నచిన్న కేసులా? : చంద్రబాబు

Last Updated : May 20, 2020, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details