Central Team Visit to Cyclone Affected Areas in Krishna District: కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలంలో జాతీయ విపత్తు నిర్వహణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ నేతృత్వంలోని బృందం పర్యటించింది. కంకిపాడు రైతు భరోసా కేంద్రం- 2 లో జిల్లాలో జరిగిన పంట నష్టం ఛాయాచిత్ర ప్రదర్శనను పరిశీలించింది. మిగ్జాం తుపానుకు జిల్లాలో జరిగిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు వాటిల్లిన నష్టం, దెబ్బతిన్న రహదారులు, విద్యుత్తు లైన్లు తదితర రంగాలకు జరిగిన నష్టాలపై జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ కేంద్ర బృందానికి వివరించారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో సుమారు లక్షా 2 వేల హెక్టార్ల వరి పంట, 9 వందల 14 హెక్టార్ల ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి అధికారులు తెలిపారు. ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించి 312 కిలోమీటర్ల మేరకు 57 రహదారులు, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి 17 కిలోమీటర్ల మేరకు 6 రహదారులు దెబ్బతిన్నట్లు వివరించారు. అనంతరం దావులూరు గ్రామంలోని దెబ్బతిన్న వరి పంటలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు.
కేెంద్ర కరవు బృందాన్ని అడ్డుకున్న రైతులు - తడిసిన పంటల ఫొటో ప్రదర్శన
Crop Loss due to Cyclone Michaung in AP: అనంతరం దావులూరు గ్రామంలో దెబ్బతిన్న వరి పంటను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. పంట నష్టం అంచనాలు రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చామని, తొలి రోజున కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నామని జాతీయ విపత్తు నిర్వహణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ తెలిపారు.
తాము పర్యటించిన పలు ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో నీరు నిలిచి ఉన్నందున జిల్లా యంత్రాంగం ఇప్పటికే పంట నష్టం అంచనా వేయడానికి ఎన్యుమరేషన్ చేపట్టిందని ఆ ప్రక్రియ పూర్తయ్యాక సరైన పంట నష్టం అంచనాలు అందుతాయని దాని ఆధారంగా సంపూర్ణ రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని, నష్టపోయిన రైతులను నిబంధనల మేరకు ఆదుకోవాలని తాము సిఫార్సు చేస్తామని ఆయన చెప్పారు.