ఎన్డీఏలోకి రావాలని జగన్కు కేంద్రమంత్రి ఆహ్వానం - ycp
వచ్చే ఎన్నికల్లో ఏపీలో భాజపా కొన్ని స్థానాలను కైవసం చేసుకుంటుంది... వైకాపా మరిన్ని స్థానాలు గెలుపొందుతుంది- మీడియాతో కేంద్రమంత్రి రాం దాస్ అథవాలే
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్ పార్టీ నుంచి మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి పోటి చేస్తున్న శివనాగేశ్వరరావు తరపున ప్రచారం చేసేందుకు వచ్చిన ఆయన.... విజయవాడ భాజపా కార్యాలయంలో సమావేశమయ్యారు. ఐదేళ్లలో మోదీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని.... ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని రామ్ దాస్ కొనియాడారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు అనవసరంగా బయటకు వచ్చారని.... ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని రామ్ దాస్ విమర్శించారు. ఏపీలో 12 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులను పోటీలో ఉంచుతున్నామని....మిగిలిన చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దళిత వ్యతిరేకి అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న ఆయన....ఎన్నికల అనంతరం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్లు రామ్ దాస్ వెల్లడించారు.