Bangladeshi nationals arrested: కృష్ణా జిల్లా గన్నవరంలోని కోల్‌కతా - చెన్నై జాతీయ రహదారి పక్కన ఉన్న సినిమా హాళ్ల సెంటర్. ఆ సమయంలో అక్కడ రాత్రి బీట్ విధులు నిర్వహిస్తున్నాడు కానిస్టేబుల్ మణీంద్ర. సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రం బయట ఓ ట్రక్ నిలిపి ఉంది. మెట్లపై ఓ వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. వివరాలు ఆరా తీద్దామని, అక్కడే ఉన్న ఓ హోంగార్డును వెంట తీసుకెళ్లాడు. వారు అక్కడికి వెళ్లేసరికి.. బయట ఉన్న వ్యక్తి, లోపల ఉన్న ఐదుగురు పరారయ్యారు. హోంగార్డును ఏటీఎం వద్ద కాపాలా ఉంచి, వారిని వెంబడించాడు కానిస్టేబుల్ మణీంద్ర. అతికష్టమ్మీద ఒకరిని పట్టుకున్నాడు. చేతిని గట్టిగా కొరికినా వదల్లేదు. ఆతర్వాత.. వెంటనే స్టేషన్‌కు సమాచారం అందించారు. అదనపు బలగాలు వచ్చి దొంగల్లో ఒకరిని పట్టుకోగలిగారు. మిగిలిన నలుగురు పరారయ్యారు.
తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలింది:దొరికిన ఇద్దరిని పోలీసులు సుదీర్ఘంగా విచారించగా ఈ ముఠా గురించి అనేక అంశాలు బయటకు వచ్చాయి. అవి విని విస్తుపోవడం పోలీసుల వంతైంది. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్న రీతిలో ఈ ముఠా చిన్నా చితకా దొంగతనాలకు పాల్పడదు. కేవలం ఏటీఎంలే లక్ష్యంగా చోరీలకు తెగబడుతుంటారు. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు దొరుకుతుందన్న ఆశతో ఈతరహా నేరాలకు పాల్పడుతుంటారు. వీరంతా బంగ్లాదేశీయులుగా తేలింది. వీరు చోరీకి ఎంపిక చేసుకున్న ప్రాంతానికి చేరుకోవడానికి వాహనాలను దొంగిలించి వాటిల్లోనే వెళ్తారు. గన్నవరంలో వీరు లక్ష్యంగా చేసుకున్న ఏటీఎం కేంద్రంలో రెండు యంత్రాలు ఉన్నాయి.
వీటిని అక్కడ పగలగొట్టి చోరీ చేయడం కష్టమని భావించి, ఏకంగా వీటినే శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి, అక్కడ పగలగొట్టి నగదును తీసుకెళ్లాలని తలచారు. ఇందుకు గాను పరిసర ప్రాంతాల్లోని సరకు రవాణాకు ఉపయోగించే ట్రక్‌ను దొంగతనం చేసి ఏటీఎం కేంద్రం వద్ద నిలిపారు. ఆ సమయంలో ఓ ఏటీఎంలో రూ.18లక్షలు, మరో దాంట్లో రూ.20లక్షల నగదు ఉంది. ఇంతలో పోలీసులు రావడంతో ప్రణాళిక వికటించింది.
ఆగస్టు మొదటి వారంలో దేశంలోకి:మొత్తం ఎనిమిది మంది సభ్యుల ముఠా ఈనెల మొదటి వారంలో భారత్‌లోకి ప్రవేశించినట్లు తెలిసింది. వీరు సరిహద్దుల గుండా తొలుత పశ్చిమబంగలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి రైలు ద్వారా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో అడుగుపెట్టారు. అక్కడ ఓ ఏటీఎం కేంద్రంలో చోరీకి యత్నించి విఫలమయ్యారు. ఈ ప్రయత్నంలో ఇద్దరు పట్టుబడగా ఆరుగురు పారిపోయారు. వీరు రైలు ద్వారా ఈనెల 13న విజయవాడ నగరంలో దిగారు.