కృష్ణా జిల్లా అవనిగడ్డలో.. వైద్యుడు కోట శ్రీహరిరావు.. స్థానిక సబ్ డివిజన్ పోలీసు కార్యాలయం వెనుకనున్న తన నివాసంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లగా.. ఆయన ఒక్కరే ఇంట్లో ఉన్నారు. సీసీటీవీ కెమెరాలు పైకి తిప్పేసి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు.. హత్యకేసుగా భావించి దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్పీ రవీంద్రబాబు.. పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. త్వరలోనే నిందితులను గుర్తించి వాస్తవాలు నిగ్గు తేలుస్తామని చెప్పారు.
ఉదయం చికిత్స కోసం వచ్చిన రోగులు.. శ్రీహరిరావుకు ఎంత సేపు ఫోన్ చేసినా తీయలేదు. పైకి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. జాగిలాలతో ఆధారాల కోసం వెతికారు. రోజులో ఎక్కువ భాగం వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమై ఉంటారని.. 25 ఏళ్లు ఆయన వద్ద పనిచేసిన కాంపౌండర్ తెలిపాడు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నివాసానికి 400 మీటర్లు, డివిజన్ పోలీసు కార్యాలయానికి 300 మీటర్ల దూరంలోనే.. ఈ హత్య జరగడం గమనార్హం.