వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 2200 చికిత్సలను రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి 7 జిల్లాల్లో అమల్లో ఉన్న 887 చికిత్సా విధానాలను మిగతా ఆరు జిల్లాలకూ వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అన్ని జిల్లాల్లోనూ ఆరోగ్యశ్రీ కింద అందించే చికిత్సలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. నూతనంగా వచ్చి చేరిన 887 చికిత్సలు ఇకనుంచి శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకూ వర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్న 2200 వైద్య చికిత్సలకు అదనంగా మరో 223 చికిత్సలను కూడా చేరుస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు బోన్ మారో చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేరుస్తూ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లోనూ ఈ బోన్ మ్యారో చికిత్స అందించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.