GOVERNOR ON FLAGDAY: సాయిధ దళాలు సరిహద్దుల రక్షణకే పరిమితం కాకుండా దేశ అంతర్గత సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, భూకంపాలు మొదలైన క్లిష్ట పరిస్థితులలో మనకు అండగా నిలుస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్‌భవన్‌లో సాయుధ దళాల జెండా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారతీయుల ఆలోచనల్లో సాయుధ దళాలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.
సాయుధ దళాల పతాక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడో తేదీన నిర్వహించుకుంటున్నామని... ఇది వారిని గౌరవించుకునే శుభతరుణమన్నారు. సాయిధ దళాల శౌర్యం, విధి నిర్వహణ పట్ల అంకిత భావం, అత్యున్నత స్థాయి వృత్తి నైపుణ్యం దేశానికి భిన్న రూపాలలో సహాయకారిగా ఉందన్నారు. యుధ్ద క్షేత్రంలో ప్రత్యర్ధులపై సమరభేరి మోగించి అత్యున్నత త్యాగాలతో స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారన్నారు.
మాతృభూమి రక్షణలో తమ ఆత్మీయులను కోల్పోయిన వీరనారీమణులను ఈ సందర్భంగా సన్మానించడం మన అదృష్టమన్నారు. సైనికుల నుంచి యుద్ధం అత్యున్నత త్యాగాలను కోరుతుందని, కానీ వారి కుటుంబ సభ్యులకు అపారమైన కష్టాలను తెస్తుందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సాయుధ దళాల సిబ్బంది, వారి కుటుంబాల పట్ల ప్రభుత్వాలు, పౌరులు మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి తమ వార్షిక విరాళాన్ని అందించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అభినందనీయులన్నారు.