ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాముకాట్లతో రైతన్నల ఆందోళన...అధికారుల అవగాహన - snake bites

పాముకాట్లు రైతులను కలవరపెడుతున్నాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు.. పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఏ పక్కన ఏ పాము కరుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. పాములను ఏవిధంగా పట్టుకోవాలి.. పాము కరిస్తే ఏం చేయాలనే దానిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పాము కాట్లతో రైతన్నల ఆందోళన...అధికారుల అవగాహన

By

Published : Aug 12, 2019, 7:36 PM IST

పాము కాట్లతో రైతన్నల ఆందోళన...అధికారుల అవగాహన
పాము అంటే చాలు కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. గత నెలరోజుల్లోనే అవనిగడ్డ ప్రాంతంలో పాము కాట్లు అధికంగా నమోదయ్యాయి. కాటు వేసిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించేలోపే మృత్యువాత పడిన ఘటనలున్నాయి. వర్షాలు విస్తారంగా కురుస్తుండడం వలన పొలంబాట పట్టిన రైతన్నలకు పాముకాట్లు ఆందోళన కలిగిస్తున్నాయి.

పాము విషం కన్నా... పాము కరిచిందన్న ఆందోళనే మరణాలకు కారణమని వైద్యులు అంటున్నారు. పాముకాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాములు కనిపిస్తే చేపట్టాల్సిన పనులపై అధికారులు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పామును ఎలా పట్టుకోవాలి? పాము కనపడితే ఏం చేయాలి? అనే విషయాలపై రైతులకు, స్థానికులకు శిక్షణ ఇస్తున్నారు.

80 పాములు విషరహితం

విజయవాడలోని... జిల్లా అటవీశాఖ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థలు పాములు పట్టే విధానంపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాదకరమైన త్రాచుపాము, రక్తపింజర పాములను సులువుగా ఎలా పట్టుకోవాలో చూపారు. పాములన్నింటిలో 80 శాతం పాములు విషపూరితం కాదని స్నేక్ సొసైటీ నిర్వాహకులు చెబుతున్నారు. త్రాచుపాము, కట్లపాము, రక్తపింజర, చిన్నపొడ పాములు ప్రమాదకరమని తెలిపారు.

పాము కాటుకు గురికాగానే బాధితుడు ఆందోళ చెందుతాడని.. ఆ కారణంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉందన్నారు. పాముకాటు మరణాలకు ఇదే ప్రథమ కారణమన్నారు. విషపూరితమైన పాములు కాటువేస్తే.. కాటు వేసిన ప్రదేశంలో రెండు చుక్కలు ఏర్పడతాయని.. విషం లేని పాము కాటు వేస్తే గీసుకుపోయినట్లు గీత పడుతుందని స్నేక్ సొసైటీ ప్రతినిధి పేర్కొన్నారు.

విరుగుడు అందుబాటులో..!
కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, నూజివీడు, తిరువూరు, జగ్గయ్యపేట, విశ్వనాథపల్లి, కంచికచర్ల, గన్నవరం ప్రాంతాల్లో అధికంగా పాముకాట్లు నమోదయ్యాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పాముకాట్లపై ప్రజకు అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాలోని పలు ఆసుపత్రిలో పాము కాటు విరుగుడు మందులను అందుబాటులో ఉంచుతామని అటవీశాఖ అధికారులు తెలిపారు. పాము కాటు మరణాలను తగ్గించేందుకు అన్ని రకాల చర్యలను చేపడతామన్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  • ఇంటి పరిసరాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు, గడ్డిని శుభ్రం చేయాలి.
  • కోళ్లు, జాతి కుక్కలను పెంచుకోవడం వల్ల పాములు పరిసరాలకు రావు.
  • ఇంటి పరిసరాల్లో పాములు సంచరిస్తున్నట్లు గమనిస్తే.. ఆ ప్రదేశాల్లో కిరోసిన్‌, పెట్రోల్‌, పొగాకు పదార్థాలు ధారగా పోయాలి.
  • వీళైనంత వరకూ కింద నిద్రపోకండి.. నిద్రించాల్సిన పరిస్థితి ఉంటే ఇళ్లలోకి క్రిమికీటకాలు రాకుండా తలుపులు, గడపల వద్ద రంధ్రాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • పాము కరిచిన వ్యక్తి భయాందోళనకు గురికాకుండా ధైర్యం చెప్పాలి.
  • కాటు వేసిన పైభాగంలో వెంటనే తాడుతో కొంత బిగుతుగా కట్టాలి.
  • కాటువద్ద గాయం చేసి రక్తం పోనివ్వాలి.
  • పసర్లు, నాటు మందులని కాలయాపన చేయకుండా దగ్గర్లోని ఆస్పత్రికి తరలించాలి.

ఇదీ చదవండి :అమ్మా.. నీ బాధ చూడలేనమ్మా...!

ABOUT THE AUTHOR

...view details