ఆయుష్ వైద్యుల ఉద్యోగ విరమణ వయసును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తగ్గిస్తూ జీవో 139ను జారీ చేసింది. దీనివల్ల సుమారు 18 మంది ప్రొఫెసర్లు వెంటనే విధులకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. అల్లోపతి వైద్యుల ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 63 ఏళ్లకు 2017 మేలో అప్పటి ప్రభుత్వం పెంచింది. వీరితో సమానంగా రాజమండ్రి, గుడివాడ, కడపలో హోమియో.... విజయవాడ ఆయుర్వేద కళాశాలలో పనిచేసే వైద్యుల ఉద్యోగ విరమణ వయసును పెంచుతూ అదే ఏడాది జూన్‌లో జీవో 97 జారీ చేసింది. దీని ప్రకారం వీరికి కొంతకాలం వేతనాల చెల్లింపులూ జరిగాయి. అయితే గత 15 నెలల నుంచి వేతనాల చెల్లింపులు నిలిచాయి. దీనిపై ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మధ్య సంప్రదింపులు జరుగుతున్నా నిర్ణయం మాత్రం వెలువడలేదు. తాజాగా జీవో 97 రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 60 ఏళ్లు దాటి పని చేసిన వైద్యులకు ఉద్యోగ విరమణ అయిన వారికి చెల్లించే వేతన విధానాన్ని వర్తింపజేయాలని ఉత్తర్వుల్లో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ఆయుష్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇప్పటికే ఆయుష్ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత వేధిస్తున్నా... 2017 నాటి జీవోను రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజమహేంద్రవరం, గుడివాడ, కడపలోని హోమియో వైద్య కళాశాలల్లో కొంతకాలం నుంచి అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న పలువురు వైద్యులపై వైద్య, ఆరోగ్య శాఖ అభియోగాలు నమోదు చేసింది.