శ్రీకాకుళం, అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని ఆరోగ్యశ్రీ అనుబంధ ఆస్పత్రుల్లో 800 రకాల వైద్య చికిత్సలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఈ చికిత్సలన్నీ నవంబరు 13 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. మిగిలిన జిల్లాల్లో ఈ విధానం ఇప్పటికే అమలవుతోందన్నారు.
నాడు నేడుపై సమీక్ష..
నాడు- నేడు కింద కొత్త బోధనాస్పత్రుల భవన నిర్మాణాలు, ప్రస్తుత ఆస్పత్రుల మౌలిక సదుపాయాల కల్పనపై గురువారం సీఎం సమీక్షించారు. కొత్తగా 16 వైద్య కళాశాలల ఏర్పాటు, ప్రస్తుత వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.17,300 కోట్ల వరకు ఖర్చవుతుంది. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో కొత్త వైద్య కళాశాలల భవనాల నిర్మాణానికి నవంబరులోగా.. అనకాపల్లి, మదనపల్లె, ఏలూరు, నరసాపురం, నంద్యాల, మార్కాపురం, బాపట్ల వైద్య కళాశాలల నిర్మాణానికి డిసెంబరులోగా టెండర్లు పిలవాలి.
మిగిలిన వాటికి జనవరిలోగా..
మిగిలిన విజయనగరం, రాజమహేంద్రవరం, పెనుకొండ, అమలాపురం, ఆదోని వైద్య కళాశాలల భవన నిర్మాణాలకు జనవరిలోగా టెండర్లు ఆహ్వానించాలి. వీటి కోసం రూ.7,500 కోట్లకుపైగా ఖర్చవుతుంది. ప్రస్తుత కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, అవసరమైన నిర్మాణ పనులకు రూ.5,472 కోట్లను వెచ్చించేందుకు పాలనామోద ఉత్తర్వులివ్వాలి. నిర్మాణాల్లో హరిత విధానాన్ని పాటించాలి.