ప్రభుత్వ పథకాలన్నీ సంతృప్తి స్థాయిలో అమలు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. తుది జాబితాలో పేరు లేకపోతే అర్హులైన వారు ఆందోళన చెందవద్దని... పథకం అమలు నుంచి నెల రోజుల్లోగా సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. దరఖాస్తులు పరిశీలించి అర్హత ఉన్నవారికి పథకాలను వర్తింపజేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
సీఎం కార్యాలయ అధికారులకు శాఖలు మార్పులు చేసిన దృష్ట్యా వారితో సీఎం జగన్ వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ పథకాల అమలు తీరుపై ఆయన సమీక్షించారు. కరోనాతో ఆర్థికంగా ప్రభుత్వానికి ఇబ్బందులున్నా పలు పథకాలను గడువు కంటే ముందే అమలు చేసి ఆదుకున్నామని సీఎం అన్నారు. వాహనమిత్ర పథకాన్ని నాలుగు నెలలు ముందుగా, నేతన్న నేస్తాన్ని ఆరునెలలు ముందుగా అమలు చేసిన సంగతిని గుర్తు చేశారు.