ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ఇంజినీరింగ్ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభించాలని కళాశాలలకు ఏఐసీటీఈ స్పష్టం చేసింది. ఈ మేరకు 2021-22 విద్యా సంవత్సర ప్రణాళిక తేదీలను ఖరారు చేసింది. సెప్టెంబరు 1 తేదీ కల్లా మిగతా తరగతులు ప్రారంభించాలని కాలేజీలకు తెలిపింది. జూన్ 30లోగా అనుమతులు మంజూరు చేస్తామని ప్రకటించింది. జులై 15 లోగా కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఏఐసీటీఈ వివరించింది.
కౌన్సిలింగ్ తేదీల ప్రకటన
ఇంజినీరింగ్ మొదటి విడత కౌన్సిలింగ్, సీట్ల భర్తీ ఆగస్టు 31లోగా.. రెండో విడత సెప్టెంబరు 9లోగా పూర్తి చేయాలని తేదీలను నిర్దేశించింది. సీట్ల రద్దు, ఫీజు తిరిగి చెల్లింపు వంటి ప్రక్రియను సెప్టెంబరు 10లోగా పూర్తి చేయాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరే ప్రక్రియను సెప్టెంబరు 20నాటికి పూర్తి చేయాలని మండలి తెలిపింది.