బిడ్డలపై ఎవరూ నిర్లక్ష్యం చేయెద్దు.. అలక్ష్యం అసలు కూడదు. అయినా ఏ మూలనో నక్కి ఉన్న మృత్యువు ఏదో ఒక రూపంలో ఆ చిరు ప్రాణాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మింగేస్తుంది. తరచూ అనేకచోట్ల జరుగుతున్న ఇలాంటి సంఘటనల్ని గమనించుకుంటూ మరింత జాగ్రత్తగా తమ పిల్లల్ని సంరక్షించుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఎంతైనా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు వరస సెలవులు రావడంతో ఇంటి పట్టున ఉంటోన్న బిడ్డలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే..!
స్నేహితులతో కలిసి ఆటలాడుకుంటూ నీళ్లలో పడి ఊపిరాడక ఎందరో చిన్నారులు ప్రాణాలొదిలేస్తున్నారు. వీరిలో పదేళ్లలోపువారే ఎక్కువగా ఉంటున్నారు. తల్లిదండ్రులు, కుటుంబంలో ఇతర సభ్యులు మందలించారన్న కారణంతో మనస్తాపానికి గురై మరికొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
2019 ఏప్రిల్ నుంచి జరిగిన దుర్ఘటనలివిగో..
- ముదినేపల్లి మండలం పెయ్యేరుకు చెందిన పదేళ్ల బాలుడు ఏప్రిల్ 4న ఇంటి వెనక ఉన్న పంటబోదెలో స్నానం చేస్తూ జల ప్రవాహం అధికం కావడంతో నీటిలో మునిపోయాడు. గట్టెక్కే అవకాశం లేక ప్రాణాలు కోల్పోయాడు.
- విస్సన్నపేట మండలం కొర్లమండ గ్రామానికి చెందిన దంపతులు ఉపాధి హామీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 28న వారు పనికి వెళ్లిన తరవాత చిన్న కుమారుడు (9) ఆటలాడుకుంటూ సమీపంలోని చెరువులో పడి మృతి చెందాడు.
- మోపిదేవి మండలంలో మే 23న మట్టి పెళ్లలు మీద పడి ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
- పెడన మండలం కొంగంచెర్లకు చెందిన విద్యార్థి (17) ఐటిఐ పూర్తిచేసి వ్యవసాయంలో కుటుంబానికి అండగా ఉంటున్నాడు. మే 27న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
- బందరు శివార్లలో చదువుపై ఆసక్తి లేక మానసిక ఒత్తిడికి గురవుతూ 14 ఏళ్ల బాలుడు ఇంట్లోనే ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు.
- జిల్లాలోని మునుకుళ్ల గ్రామానికి చెందిన ఓ కుటుంబం జీవనోపాధికి పొరుగు జిల్లాకు వలస వెళ్లారు. పెద్దలు మందలించారన్న కారణంతో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
- విస్సన్నపేట మండలం కలగర పంచాయతీ శివారు గ్రామంలో జూన్ 24న స్నేహితులతో కలిసి ఆటలాడుకుంటూ చెరువులో దిగిన బాలుడు (8), బాలిక (12) ఊపిరాడక మరణించారు.
- భాస్కరపురం శివార్లలో ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు మందలించారన్న కారణంతో మనస్తాపానికిలోనై ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది.
- తిరువూరు మండలం జి.కొత్తూరు శివారు చిక్కుళ్లగూడెం వద్ద జూన్ 26న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో పన్నెండేళ్ల బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
- గంపలగూడెం మండలం నెమలి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు ఇటీవల కుక్క కాటు వల్ల అస్వస్థతకు గురై మరణించాడు.
- కోడూరు మండలం జయపురం ఎస్సీవాడలో పసి పిల్లల్ని ఆడించడానికి చీరతో కట్టిన ఊయలలో ఊగుతుండగా చీర మెడకు బిగిసుకుపోవడంతో ఊపిరాడక ఆరేళ్ల బాలుడు జులై 6న ప్రాణాలొదిలేశాడు.