Serving Free Food:కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన చిట్టా ప్రసాద్ కొన్నేళ్ల క్రితం తనకు ఎదురైన ఓ అనుభవంతో ఆకలి విలువ తెలుసుకున్నారు. చేతినిండా డబ్బు ఉన్నప్పుడు కూడా ఓ రోజు ఆయనకు ఎక్కడా, ఏ హోటల్లోనూ భోజనం లభించలేదు. డబ్బు ఉన్నవారి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ఎవరూ లేని అభాగ్యులు, యాచకులు, వృద్ధుల పరిస్థితి ఏంటా అని ఆలోచించారు. దాని ఫలితమే.. పదేళ్లుగా రోజుకు సుమారు 40 మంది ఆకలి తీరుస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ రోజుకు 200 మందికి 2 పూటలా ఆహారమందించారు.
ప్రసాద్ చేస్తున్న మంచి పనికి స్థానికులు, స్వచ్ఛంద సేవకులందరూ తలో చేయి వేశారు. తమకు చేతనైన సాయం చేస్తున్నారు. 10 మంది ఆకలిని తీర్చడం తనకు ఎంతో ఆనందంగా ఉందని.. తన ఊపిరి ఉన్నంతవరకు ఈ అన్నదానం కార్యక్రమం కొనసాగిస్తానని ప్రసాద్ అంటున్నారు. అన్నదానానికి ఎవరైనా దాతలు విరాళాలు ఇస్తే వారి పేరున కూడా మరింత మంది కడుపు నింపుతానని చెబుతున్నారు.