నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) కింద కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రకటించిన ఉన్నత విద్యాసంస్థల ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు పెద్దగా సత్తా చాటలేకపోయాయి. మొత్తం పది విభాగాల్లో 760 ర్యాంకులు ప్రకటించగా, అందులో రెండు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు 58 ర్యాంకులు దక్కాయి. తెలంగాణలోని విద్యాసంస్థలకు 28, ఏపీలోని విద్యాసంస్థలకు 30 ర్యాంకులు వచ్చాయి. ఇంజినీరింగ్ విభాగంలో హైదరాబాద్ ఐఐటీ, ఓవరాల్, యూనివర్సిటీల విభాగంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగురాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచాయి.
సత్తా చాటిన ఐఐటీలు
ఓవరాల్ విభాగంలో మద్రాస్ ఐఐటీ, విశ్వవిద్యాలయాల విభాగంలో బెంగళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తొలి స్థానాల్లో నిలిచాయి. బెంగళూరు ఐఐఎస్‌సీ, జేఎన్‌యూ, బెనారస్ హిందూ వర్సిటీ దేశంలో మొదటి మూడు విశ్వవిద్యాలయాలుగా నిలిచాయి. మొదటి మూడు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఐఐటీ మద్రాస్, ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే నిలిచాయి.