police seized stolen property: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్. శ్రీధర్ సూచనల మేరకు రామచంద్రాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ పర్యవేక్షణలో చాకచక్యంగా చోరీ కేసును పోలీసులు చేధించారు. పుర్తి వివరాల ప్రకారం ఈ నెల 8వ తేదీన మాచవరం గ్రామానికి చెందిన నల్లమిల్లి దారారెడ్డి రామచంద్రపురంలో ఎస్బీహెచ్, ఎచ్డీఎఫ్సీ బ్యాంకుల్లో డ్రా చేసిన రూ. 3,55,000 బైక్ డిక్కీలో పెట్టి ఏటీఎం వద్ద పార్కింగ్ చేశాడు. ఏటీఎం లోపలికి వెళ్లి వచ్చేలోగా గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ తాళం చెవితో డిక్కీ తెరిచి నగదును అపహరించారు.
బాధితుడు రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ సురేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఖేష్ కుమార్, రోహిత్ కుమార్ను అదుపులోకి తీసుకుని వారిని విచారించగా... నగదు అపహరించినట్లు నిందితులు వెల్లడించారు. వారి వద్ద నుంచి 3.55 లక్షల నగదును రికవరీ చేసినట్లు రామచంద్రపురం డీఎస్పీ టిఎస్ ఆర్కే ప్రసాద్ తెలిపారు. పలు చోరీ కేసుల్లో ఇరువురూ ప్రధాన నిందితులుగా ఉన్నట్లు మీడియాకి వెల్లడించారు. ఈ కేసును చేధించిన పోలీసులను సీఐ వి.దుర్గారావు, ఎస్సై డి.సురేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ వీరబాబు, మల్లికార్జున రావు, తదితర సిబ్బందిని డీఎస్పీ ప్రసాద్ అభినందించి వారికి రివార్డులను అందజేశారు.