A big accident missed in Mummidivaram mandal Gadilanka: ఇటీవల కాలంలో ఇంటి పరిసరాల్లో.. గడ్డివాముల్లో.. వాషింగ్ మిషన్లో.. మోటార్ సైకిల్లో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పాములు సంచరిస్తున్న ఘటనలు సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తూనే ఉన్నాం. వాటి కదలికలను గుర్తించిన వారు వెంటనే అప్రమత్తమై.. పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇస్తున్నారు. దీంతో ఆ వ్యక్తులు (పాములు పట్టేవారు) చాకచక్యంగా వాటిని ఓ సంచిలో బంధించి, జన సంచారం లేని ప్రాంతాల్లో వదిలిపెడుతున్నారు. తాజాగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామం వద్ద ఓ విచిత్ర సంఘటన జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకుపోతున్న కారు స్టీరింగ్ పైకి ఓ పాము వచ్చింది. దీంతో ఆ కారు డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
స్టీరింగ్‌పైకి వచ్చిన పాము-అదుపు తప్పిన కారు.. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక వద్ద ఈరోజు పెనుప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకుపోతున్న కారు స్టీరింగ్‌పైకి ఓ పాము వచ్చింది. దీంతో ఆ కారు డ్రైవర్ భయాందోళనకు గురై, స్టీరింగ్‌ను వదిలిపెట్టాడు. క్షణాల వ్యవధిలోనే ఆ కారు పక్కనే ఉన్న పొలాల్లోకి వేగంగా దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఉన్నవారందరు భయంతో గజగజ వణికిపోయారు. అదృష్టవశాత్తూ కారులో ఉన్నవారికి ఎటువంటి గాయాలు గానీ, ప్రాణం నష్టం గానీ జరగకపోవడంతో స్థానికులు, వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.