ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాండౌస్ తుపాన్ ప్రభావం.. ధాన్యం కాపాడుకునేందుకు రైతుల పాట్లు - పొలాలపై మాండస్ సైక్లోన్ ప్రభావం

Madous Cyclone effect: ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో దిగాలు పడుతున్న రైతన్నకు మాండౌస్ తుపాను కోలుకోలేని దెబ్బకొట్టింది. తేమశాతం నిబంధనలు, గోనె సంచుల కొరతతో కళ్లాలు, పొలం గట్లు, రోడ్లపై నుంచి కదలని ధాన్యం తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో తడిసి ముద్దవుతోంది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరానిపాట్లు పడుతున్నారు.

grain
ధాన్యం

By

Published : Dec 11, 2022, 2:49 PM IST

Madous Cyclone effect: సీజన్ ప్రారంభం నుంచే ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఉన్న అవకాశాలను బట్టి ధాన్యం విక్రయించే వీలు లేకుండా ప్రభుత్వం నిబంధనలు పేరిట విమష పరీక్ష పెట్టింది. ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు నానా పాట్లు పడాల్సి వస్తోంది. తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వేల ఎకరాల్లో వరి కోతలు పూర్తవ్వలేదు. కొన్ని చోట్ల పంట కోసి పనలమీద ఉంచగా మరికొన్ని చోట్ల.. ధాన్యం కళ్లాల్లో ఆరబెట్టారు. కాకినాడ గ్రామీణం, పిఠాపురం, గొల్లప్రోలు, ప్రత్తిపాడు, ఏళేశ్వరం, జగ్గంపేట, గండేపల్లి, పెద్దాపురం, సామర్లకోట మండలాల్లో ఇంకా వరి మాసూళ్లు పూర్తి కావాల్సి ఉంది. ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల..కళ్లాల్లోనే ఉంచారు. ఈ సమయంలో తుపాను రైతుల్లో కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వర్షం కారణంగా ధాన్యం తడిసి తేమశాతం పెరిగిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోనసీమ జిల్లాలోని అమలాపురం డివిజన్‌లో ఇంకా ముప్పై శాతం పైగా వరి కోతలు పూర్తవ్వాల్సి ఉంది. కొన్ని చోట్ల ధాన్యం ఆరబెట్టారు. అయినవిల్లి, అంబాజీపేట, పి.గన్నవరం, మామిడికుదురు, అమలాపురం మండలాల్లో వరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రామచంద్రపురం డివిజన్‌లోని కె.గంగవరం, కాజులూరు, రామచంద్రపురం ప్రాంతాల్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడచిపోతోంది. వర్షం నుంచి కాపాడుకునేందుకు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజానగరం, కోరుకొండ, గోకవరం, సీతానగరం, గోపాలపురం, నల్లజర్ల, దేవరపల్లి మండలాల్లో...సర్వర్లు, ఆన్ లైన్ ఇబ్బందులు, గోనె సంచుల కొరతతో ధాన్యం కొనుగోళ్లు చేయలేదు. వర్షంతో రైతులు పాలుపోని పరిస్థితుల్లో చిక్కుకున్నారు.

మాండౌస్‌ తుపాను కృష్ణా జిల్లా దివిసీమ రైతులను కన్నీరుపెట్టిస్తోంది. పంటను కొనే దిక్కులేక, మార్కెట్‌కు తరలించలేక కళ్లాల్లోనే ఆరబెట్టిన ధాన్యం వర్షాలకు తడసిముద్దవుతోంది. గతంలో కోత కోసి వెంటనే మిల్లుకు తరలించుకునే వారమని తేమ శాతాన్ని బట్టి మిల్లర్లు అప్పటికప్పుడు ధర నిర్ణయించి ధాన్యం తీసుకెళ్లేవారని కానీ నేడు ప్రభుత్వమే అన్ని పనులు చేస్తామంటూ సంచులు ఇచ్చేందుకు కూడా రోజులు తరబడి తిప్పుకుంటోందని రైతులు వాపోయారు. దీనివల్లే పంటను ఇంతవరకు మిల్లుకు చేర్చలేకపోయామని, ఇప్పడు చూస్తే తుఫాను వల్ల ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముసురు వానలు ఈనెల 13వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉండటంతో ధాన్యం రైతులు దిగులుతో తల్లడిల్లుతున్నారు.

తుపాన్ ప్రభావంతో దిగులు పడుతున్న రైతులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details