YSR Matsyakara Bharosa Scheme:కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో నిర్వహించిన మత్స్యకార భరోసా సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని నిధులు విడుదల చేశారు. ఈ ఏడాది దాదాపు 109 కోట్ల రూపాయలు మత్స్యకారులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఓఎన్జీసీ డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు 4 నెలల పాటు... సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. సరికొత్త కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని సీఎం అన్నారు.
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద రూ.109కోట్లు విడుదల మత్స్యకార భరోసా సభ వేదికగా... ప్రతిపక్షాలపై సీఎం విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రతి మంచి పనినీ అడ్డుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు సహా ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రశ్నాపత్రాల లీకేజీ సహా వివిధ కేసుల్లో మాజీ మంత్రులను అరెస్ట్ చేస్తే... వారిని సమర్థిస్తూ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి పేదవాడికి న్యాయం జరగాలనేదే లక్ష్యం.పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. పేదవాళ్లందరినీ నా వాళ్లుగా భావించా. పేదల కోసం 32 పథకాలు అమలు చేస్తున్నాం.చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటున్నాం. మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున అందిస్తున్నాం. మత్స్యకార భరోసా కింద రూ.419 కోట్లు అందివ్వగలిగాం. -వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి
అంతకుముందు ఐ.పోలవరం మండలం కొమరగిరిలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు పరిమిత సంఖ్యలోనే నాయకులను అనుమతించడంతో.... జిల్లా స్థాయి నేతలు మనస్తాపానికి గురయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు హెలిప్యాడ్ వద్దే గడిపి.... అనంతరం మురముళ్లలోని సభాస్థలికి చేరుకున్నారు. హెలిప్యాడ్ ఏర్పాటుచేసిన ప్రాంతానికి, బహిరంగ సభాస్థలానికి 3 కిలోమీటర్ల దూరం ఉండగా సీఎం వచ్చి, తిరిగి వెళ్లే వరకు.. ఆ దారిలో వాహనాలను అనుమతించకపోవడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పెద్దమడి గ్రామంలో అత్యవసరంగా... అనారోగ్యంతో ఉన్నవారిని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రాగా... రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టడంతో.. వెనక్కు వెళ్లిపోయింది. హెలిప్యాడ్ వద్ద ఉదయం నుంచి విధుల్లో ఉన్న పోలీసులు... మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భోజనం ప్యాకెట్లు రాగానే... వాటి కోసం ఎగబడ్డారు. హెలిప్యాడ్ వద్దకు సొంత మీడియాను తప్ప మరెవర్నీ అనుమతించలేదు.
ఇదీ చదవండి: