TDP on Jagan policies: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం రాజ్యాంగ వ్యవస్థల్ని వినియోగిస్తోందని మండిపడ్డారు. దేశానికి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులపై సొంత కక్ష సాధించేందుకు సీఐడీని వాడటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. దశాబ్దాల నుంచి ప్రజల్లో మార్గదర్శిపై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీయటానికి సీఐడీని ప్రయోగించటం దుర్మార్గమని బోండా ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగుజాతి ఐకాన్‌గా ప్రపంచం గుర్తిస్తే, జగన్మోహన్ రెడ్డి ఓ అంధుడిలా నటిస్తున్నారని దుయ్యబట్టారు. సొంత బాబాయ్ హత్య కేసులోనే నమ్మిన వారిని నట్టేట ముంచిన రకం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.
ప్రశ్నిస్తే ఎవరిమీదైనా తప్పుడు కేసులు: మార్గదర్శిని సీఐడీ ద్వారా వేధించే హక్కు జగన్‌కి ఎవరిచ్చారని ఉమామహేశ్వరరావు నిలదీశారు. అవినీతి ని వెలికితీసి, ప్రశ్నిస్తే ఎవరిమీదైనా తప్పుడు కేసులు పెడతారా అని ప్రశ్నించారు. నాలుగేళ్ల నుంచి ఏపీ వైపు చూడాలంటేనే ఏ పారిశ్రామికవేతైనా భయపడేలా చేశారని ధ్వజమెత్తారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో అగ్రీగోల్డ్ సహా వేల కోట్ల రూపాయలు అవినీతి వివిధ సంస్థల ద్వారా జరిగితే ఏ ఒక్కరికీ న్యాయం చేయలేదని ఉమా ఆక్షేపించారు. ఒక్క ఫిర్యాదు కూడా లేని మార్గదర్శి మీద మాత్రం అక్రమ కేసులా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా స్వామ్యంలో ప్రశ్నించే గొంతుకల్ని ఇలా విధించాలని చూస్తే వెంట్రుక కూడా జగన్మోహన్ రెడ్డి పీకలేరని స్పష్టం చేశారు. మహా మహా నియంతలే కాలగర్భంలో కలిసిపోయిన విషయాన్ని జగన్ గ్రహించాలని ఉమా హితవు పలికారు. రాబోయో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతలకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బోండా ఉమా హెచ్చరించారు.