MLC Anantababu: ‘వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు.. కాలు, చెయ్యి తీసేస్తానని మమ్మల్ని బెదిరించాడు. రూ.రెండు లక్షలు ఇస్తాను... మృతదేహాన్ని తీసుకుపోవాలి. లేదంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు..’ అని మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ విషయాలను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు.
మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుపై తయారు చేసిన రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కాకినాడలోని ప్రత్యేక మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్/ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు మే 23న డీఎస్పీ ఆ రిమాండ్ రిపోర్టు ఉంచారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీగా అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) ప్రధాన నిందితుడిగా అరెస్టయి.. రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
హత్యకు కారణాలపై కుటుంబసభ్యుల నుంచి భిన్న ఆరోపణలు వినిపిస్తుంటే.. సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ మధ్య మాటామాటా పెరిగి అహం దెబ్బతిని వెనక్కి తోయడంతో డ్రైవర్ చనిపోయినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబం ఆరోపణ, నిందితుడి వాంగ్మూలం పరిగణనలోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చడంతో పాటు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, సాక్ష్యాధారాలు తారుమారు చేయడంపైనా దర్యాప్తు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిమాండ్ రిపోర్టులో మే 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ నెలకొన్న అన్ని పరిణామాలను పేర్కొన్నారు.
హత్య జరిగింది ఇక్కడేనా..?మాజీ డ్రైవర్ హత్యకేసు దర్యాప్తులో భాగంగా మధ్యవర్తుల నివేదిక ప్రకారం.. కాకినాడ నగరంలోని శశికాంత్‌నగర్ వి.ఎస్.లక్ష్మి డిగ్రీకళాశాల రోడ్డులోని మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ యార్డు వద్దకు ఎమ్మెల్సీని తీసుకెళ్లి విచారించారు. యార్డుకు ఆనుకుని దక్షిణ దిశలో ఉన్నఇసుక, ఎర్రకంకర మట్టిరోడ్డు మీదకు తీసుకెళ్లి.. అనంతబాబు చూపించారని పేర్కొన్నారు.
సుబ్రహ్మణ్యాన్ని చంపినప్పుడు అతన్ని కదలకుండా కట్టిన తాడు అని చెప్పి ఆ తాడును డీఎస్పీకి స్వాధీన పరిచారని పేర్కొన్నారు. అక్కడే ఉత్తర దిశగా కాలువకు ఆనుకుని ఉన్న ప్రదేశంలో సర్వే కర్రతో మృతుడు సుబ్రహ్మణ్యాన్ని కొట్టినట్లు చూపారని పేర్కొన్నారు. తాడు, కర్ర, మృతుని చెప్పులను ఆ ప్రాంతం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
ఇదిలాఉండగా.. సుబ్రహ్మణ్యం మృతదేహానికి కాకినాడ జీజీహెచ్‌లో మే 21న శవ పంచనామా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మృతదేహంపై 15 గాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
సెల్‌ఫోన్‌లో ఏముంది..?కేసు దర్యాప్తులో భాగంగా మే 23న పండూరు రోడ్డులో వాటర్ ట్యాంకు దగ్గర ఎమ్మెల్సీ అనంతను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ఐ13 గోల్డ్ కలర్ యాపిల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబీకులను హెచ్చరిస్తూ ఫోన్ చేశారనే ఆరోపణలు.. అనంతబాబు రహస్యాలు తెలుసనే కారణంతోనే హత్య చేశారన్న నేపథ్యంలో కాల్‌డేటాతో పాటు సెల్ ఫోన్‌లో నిక్షిప్తమైన సమాచారం కీలకం కానుంది.
- నేను చెప్పింది వినాలి..‘రోడ్డు ప్రమాదంలో మీ కుమారుడు చనిపోయాడు.. రూ.2 లక్షలు ఇస్తా.. మృతదేహాన్ని మీ స్వగ్రామానికి తీసుకెళ్లి దహనం చెయ్యండి.. నేను చెప్పింది వినాలి.. లేదంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’
- హత్యకు గురైన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన హెచ్చరికలివి.. (రిమాండ్ రిపోర్టు ఆధారంగా..)
మే 19న రాత్రి 8.30 గంటలకు ఎమ్మెల్సీ అనంతబాబు నా భర్తకు ఫోన్ చేశాడు.. తర్వాత నాతో మాట్లాడుతూ..‘ నీ కొడుకు నాకు రూ.20వేలు ఇవ్వాలి కదా.. ఇవ్వడా.. నాకు డ్రైవర్ లేడు.. వాడు పని మానేశాడు.. డబ్బులు ఇచ్చేయాలని చెప్పు లేకపోతే కాలు, చెయ్యి తీసేస్తాన’ని బెదిరించాడని పోలీసులకు తల్లి నూకరత్నం చెప్పారు. - అనంతబాబు రహస్యాలు తన కొడుకు బయటపెడితే.. ఇబ్బంది అవుతున్న కారణంతో కొందరితో కలిసి చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. తమఅబ్బాయిని అనంతబాబు, అతని అనుచరులు చంపేశారన్నారు.
రహస్యాలు తెలుసనే..రహస్యాలు తన కొడుక్కి తెలుసనే కక్షతో మరికొందరితో కలిసి బీచ్‌కు తీసుకెళ్లి కొట్టి.. అనంతబాబు, అతని అనుచరులు చంపారని తండ్రి సత్యనారాయణ చెప్పారు.
2 లక్షలు ఇస్తానన్నాడు..తనసోదరుడి మరణానికి కారణం అడిగితే.. అదంతా నీకు అనవసరం.. రూ. 2 లక్షలు ఇస్తాను.. మీ ఊరు తీసుకెళ్లి అంత్యక్రియలు చేయండి.. ఒకటి ఒకటి అలా జరుగుతుంటాయని ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరించారని సోదరుడు నవీన్ వాంగ్మూలం ఇచ్చారు.