ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏడుగురిని బలిగొన్న ట్యాంకు' చెప్పే మృత్యుగాథలు.. వింటుంటే, గుండెతరుక్కుపోతోంది..! - AP Latest News

Kakinada oil tank incident: కాకినాడ జిల్లా నూనె పరిశ్రమలో ఏడుగురు చనిపోయిన ఘటనలో యాజమాన్య నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస రక్షణ చర్యలు పాటించకుండా 24 అడుగుల లోతైన ట్యాంకులోకి కార్మికులను దింపడంతోనే వారంతా ఊపిరాడక మృతి చెందారని స్థానికులు అంటున్నారు. అయితే ఆక్సిజన్ అందక కార్మికులు చనిపోయారా..?...లేక నెలల తరబడి ఆయిల్ ట్యాంక్ శుభ్రం చేయకపోవడం వల్ల తయారైన విషవాయువులు పీల్చి ప్రాణాలు వదిలారా అన్నది తేలాల్సి ఉంది. ఆసరాగా ఉండాల్సిన బిడ్డల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోవడంతో కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది.

Kakinada oil tank incident
Kakinada oil tank incident

By

Published : Feb 10, 2023, 10:01 AM IST

Updated : Feb 10, 2023, 10:12 AM IST

Kakinada oil tank incident: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేట అంబటి సుబ్బయ్య నూనె పరిశ్రమలో ఏడుగురి కార్మికులు చనిపోవడం అందరినీ కలిచి వేసింది. కార్మికులను 24 అడుగుల లోతైన నూనె ట్యాంకు శుద్ధి చేసేందుకు దించారు. ట్యాంకుకు పైన మూత మాత్రమే తెరిచి ఉండగా.. లోపలకు దిగేందుకు ఇనుప నిచ్చెన అమర్చారు. ఇంత లోతైన ట్యాంకులోకి దిగేందుకు కార్మికులకు ఆక్సిజన్ సిలెండర్, మాస్క్ అమర్చాలి.. లోపలికి దిగిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉందన్నది క్షణక్షణం పరిశీలించాలని నిపుణులు అంటున్నారు. అలాగే ట్యాంకుకు కింది భాగంలో తెరిచేందుకు వాల్ ఏర్పాటు చేయాలని.. కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కార్మికుల్ని లోపలికి దించడం వల్ల మరణాలు సంభవించాయని చెబుతున్నారు.

ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ కార్మికుడు కిరణ్‌ లోపల ఊపిరాడలేదని తెలిపాడు. నాల్ ఎడిబుల్ నూనె నిల్వ చేసే ట్యాంకు కావడం, నెలల తరబడి శుద్ధి చేయకుండా మూత బిగించి ఉండటంవల్ల ట్యాంకులో విషవాయువులు తయారయ్యే అవకాశం ఉందని....అదే 7గురు కార్మికులు ప్రాణాలు వదలడానికి కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మృతదేహాలను చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కొందరు యాజమాన్యంపై దాడికి దిగారు. చనిపోయిన వారిలో పెద్దాపురం మండలం పులిమేరుకు చెందిన 27 ఏళ్ల దుర్గాప్రసాద్ కు 11 నెలల క్రితమే పెళ్లయింది. భార్య సత్య 7 నెలల గర్భిణి. ఇంటర్ చదివిన దుర్గాప్రసాద్ 5 నెలల క్రితమే ఈ పరిశ్రమలో చేరాడు. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో భార్య, తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. అలాగే పులిమేరుకు చెందిన కట్టమూరి నాని, లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు 25ఏళ్ల జగదీష్ ఐటీఐ చదివి ఈ పరిశ్రమలో చేరాడు.

పెళ్లి చేయాలనుకుంటున్న సమయంలో జగదీష్ ప్రమాదంలో ప్రాణం కోల్పోయాడు. అలాగే అల్లూరి పాడేరు జిల్లా పెదబయలు మండలానికి చెందిన గిరిజనులు ఈ నెల మూడున రోజూ కూలీలుగా పనుల్లో చేరారు. ఈ ఐదుగురు అడవి బిడ్డలు ఈ దుర్ఘటనలో బలైపోయారు. బాధిక కుటుంబాలకు న్యాయం జరిగేలా పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, ఇతర పార్టీలకు చెందిన నాయకులు యాజమాన్యంతో చర్చలు జరిపారు. ప్రభుత్వం, యాజమాన్యం కలిసి బాధిత కుటుంబ సభ్యులకు 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. కోటి రూపాయల చొప్పున ఇవ్వాలని బాధితులు డిమాండ్‌ చేయగా..అధికార పార్టీ నాయకులు, అధికారులు నచ్చజెప్పారు.

యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరిశ్రమను సీజ్ చేశామని కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. ఐదుగురు సభ్యులతో కలెక్టర్ కమిటీ వేశారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాకినాడ జిల్లాలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు సంభవించి కార్మికులు మృతి చెందుతున్నా...యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మృత్యు ట్యాంకు.. స్పష్టంగా యాజమాన్య నిర్లక్ష్యం

ఇవీ చదవండి:

Last Updated : Feb 10, 2023, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details