Pawan Tour in Kakinada: రాష్ట్రంలో రానున్న ఎన్నికల దృష్ట్యా రాజకీయ పార్టీలన్ని ఎన్నికలకు సమయత్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార వైఎస్సార్సీపీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్లను మారుస్తోంది. అంతేకాకుండా పోటీలో దిగే అభ్యర్థుల స్థానాల్లో కూడా మార్పులు చేపట్టింది. తెలుగుదేశం - జనసేనల పొత్తు కూడా ఆ దిశగా పయనిస్తోంది. ఏ పార్టీ శ్రేణులను ఆ పార్టీ సిద్ధం చేసుకుంటోంది.
జనసేన పార్టీ తెలుగుదేశంతో కలిసిన పొత్తుతో బలంగా ఉన్నామనే భయం జగన్ మాటల్లో కనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడలో మూడోరోజూ పవన్ పర్యటించనున్నారు. జనసేన ముఖ్య నాయకులతో పవన్ సమావేశం కానున్నారు.
శుక్రవారం కాకినాడ నగర నియోజకవర్గ పరిధిలోని 20 డివిజన్లలోని పరిస్థితిపై ఆయన సమీక్షించారు. సమస్యలు, ప్రభుత్వ పనితీరుపై ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయా డివిజన్ల జనసేన అధ్యక్షులు, మహిళలు, తటస్థులతో పవన్ భేటీ అయ్యారు. తర్వాత నగరంలోని వైద్యులు, న్యాయవాదులు, ఇంజినీర్లు, వ్యాపారులు, కార్మిక సంఘాలు, ఇతర కీలక వర్గాలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు.
పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్
వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అందరి లక్ష్యం కావాలని, ఆ వ్యూహానికి కాకినాడ నుంచే శ్రీకారం చుడదామని పవన్ పిలుపునిచ్చారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఒక్కసీటు కూడా వైసీపీకి దక్కకూడదని అందుకు తగ్గట్టుగా ప్రజల్లోకి వెళ్లి శ్రమించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.