కాకినాడ నగర శివారు ప్రాంతలైన సత్యదుర్గానగర్, అల్లూరి సీతారామరాజు కాలనీ, రాఘవేంద్రపురం, శివకృష్ణా కాలనీ, హోప్ ఐలాండ్ కాలనీలు ఏడాది కాలంగా తాగునీటి సమస్యతో సతమతమవుతున్నాయి. ఎండలు పెరగడంతో ఈ ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. అరకొరగా వచ్చే రక్షిత మంచి నీరు సైతం కలుషితమై తాగేందుకు పనికిరావడం లేదని స్థానికులు వాపోతున్నారు. మంచి నీటి కోసం నగరపాలక సంస్థ పంపించే ట్యాంకుల దగ్గర నిత్యం కొట్లాటలు తప్పడం లేదంటున్నారు.
కాకినాడ నగర శివారు వాసులకు ... తాగునీటి కష్టాలు
భానుడి భగభగలతో పాటు భూ గర్భ జలాలు తరిగిపోతున్న నేపథ్యంలో తాగునీటి కష్టాలు పెరిగిపోతున్నాయి. కాకినాడ నగర శివారు ప్రాంతాలు, పరిసర గ్రామాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. నగరపాలక సంస్థ సరఫరా చేసే నీరు సకాలంలో రాక కాకినాడ ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. పైపులైన్ల సౌకర్యంలేని కాలనీలకు వారానికోసారి వచ్చే ట్యాంకుల నీరే ఆధారమవుతోంది.
కాకినాడ నగర శివారు వాసులకు ... తాగునీటి కష్టాలు
దాదాపు 20 ఏళ్లుగా తాగునీటి కష్టాలతో సావాసం చేస్తూనే ఉన్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో ఈ సమస్య మరింత జఠిలమవుతుందని, స్వచ్ఛమైన తాగునీరు లభించక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.ఇప్పటికైనా పెరిగిన జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా అందించేలా శాశ్వత చర్యలు చేపట్టాలని ఈ కాలనీల వాసులు పాలకుల్ని వేడుకొంటున్నారు.
ఇదీ చదవండి:Water Problem : పలు పట్టణాల్లో నీటి కొరత... దాహం తీరే దారేదీ?