Chandrababu on Sadhikara Saaradhi: కాకినాడ జిల్లా జగ్గంపేటలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ తరఫు నుంచి కుటుంబ సాధికార సారథుల పేరు మీద కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిచనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ ఇంటికి పోవడం ఖాయమని చంద్రబాబు అన్నారు. ప్రజలంతా సైకోను ఇంటికి పంపాలని నిర్ణయించారని చెప్పారు. రాజకీయాల్లో ఉండే అర్హత జగన్‌కు ఏ మాత్రం లేదని చంద్రబాబు తెలిపారు. జగన్‌ను చూసి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. జగన్ ఉంటే రాష్ట్రానికి బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లు రావాల్సిందే అంటూ ఎద్దేవా చేశారు.
కుటుంబ సాధికార సారథులు: పార్టీలో కుటుంబ సాధికార సారథుల పేరిట కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి 30 కుటుంబాలకు ఈ సాధికార సారథి ఇన్ఛార్జ్లాగా వ్యవహరిస్తారన్నారు. ఆర్ధిక అసమానతలు తొలగించేలా ఈ సారథులు పని చేస్తారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు పని చేసిన వారికి అనుకున్న స్థాయిలో న్యాయం చెయ్యలేకపోయామన్న చంద్రబాబు,.. ఈ సారి అలా జరగకుండా పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇంచార్జ్లు అందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామని తెలిపారు. సాధికార సారథులుగా మహిళలతూ సమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందన్నారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఈ విభాగం పని చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.