Attacks on Those Who Question Government Failures: చంద్రబాబును చెప్పుతో కొట్టాలని, అవసరమైతే బాబు కాలర్ పట్టుకుంటానని.. బాబుకి పోగాలం..! బుద్ధి, జ్ఞానం లేవని, చంద్రబాబుకి ఉరిశిక్ష వేసినా తప్పులేదని.. ఇలా ఎంతో పరుషంగా.. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి.. అప్పటి సీఎం చంద్రబాబును దారుణ పదజాలాన్ని వినియోగించి విమర్శించారు. గతంలో సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుపై తమ నాయకుడు జగన్ చేసిన వ్యాఖ్యలపై మిన్నకున్న వైఎస్సార్సీపీ నేతలు.. ఇప్పుడు తెలుగుదేశం నేతలు చిన్న విమర్శ చేసినా, పోస్టు పెట్టినా సహించలేకపోతున్నారు. అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు సహా ఇతర తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలతో పాటు ఇతర విపక్ష నేతలపైనా.. తీవ్రస్థాయిలో అరాచకానికి, దాడులకు తెగబడుతున్నారు. మాజీ మంత్రి కొడాలి నానితో పాటు ఇలా అనేక మంది.. అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకుల్ని యథేచ్ఛగా అభ్యంతరకరమైన, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. సభ్యత మరిచి... కుటుంబ సభ్యులపైనా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే ప్రతిపక్ష నాయకులు ప్రతి విమర్శ చేస్తే తట్టుకోలేకపోతున్నారు. దాడులు చేసి తిరిగి వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారు.
చంద్రబాబు ఇంటిపై దండయాత్ర: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎప్పుడూ చూడని రెండు ఘటనలు.. వైఎస్సార్సీపీ పాలనలో జరిగాయి. ముఖ్యమంత్రి జగన్, అప్పటి హోం మంత్రి సుచరితపై తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ... పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ 2021 సెప్టెంబరు 17న పెద్ద సంఖ్యలో అల్లరి మూకలను వెంటబెట్టుకుని ఉండవల్లిలోని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దండయాత్రకు వెళ్లారు. ఆ సందర్భంగా వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో ఆయన ఇంటి పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. ఆ సమయంలో చంద్రబాబు ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు.. పరిస్థితి అదుపు తప్పి, జరగరానిది ఏమైనా జరిగి ఉంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. విచిత్రమేమిటంటే ఈ ఘటన తర్వాత జోగి రమేష్‌ను.. ముఖ్యమంత్రి మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
2021 అక్టోబరు 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైఎస్సార్సీపీ ప్రేరేపిత అల్లరి మూకలు, అసాంఘిక శక్తులు దాడికి పాల్పడ్డాయి. ఆస్తులు, వాహనాలు ధ్వంసం చేసి, కార్యాలయ సిబ్బందిని తీవ్రంగా కొట్టి విధ్వంసం సృష్టించాయి. అదే సమయంలో విశాఖ, నెల్లూరు వంటి చోట్ల టీడీపీ కార్యాలయాలపై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడులకు ప్రయత్నించాయి. టీడీపీ నేత పట్టాభి ముఖ్యమంత్రి జగన్‌పై పరుషమైన వ్యాఖ్యలు చేశారంటూ.. వైఎస్సార్సీపీ శ్రేణులు ఈ దాడులకు తెగబడ్డాయి.
కుప్పంలో హింసాకాండనే:టీడీపీ అధినేత చంద్రబాబును కుప్పంలో ఓడించాలని భావిస్తున్న వైఎస్సార్సీపీ పెద్దలు.. దానికి రాజకీయ కార్యాచరణకు బదులు, హింసాకాండనే సాధనంగా ఎంచుకున్నారు. ఏదో ఒక సాకుతో అల్లర్లు సృష్టిస్తూ, టీడీపీ శ్రేణులపై దాడులకు దిగుతూ, వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని, దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 25న చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కుప్పం పర్యటనకు వెళ్లినా... అక్కడ ఏదో ఒక రూపంలో అల్లర్లు సృష్టించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలుతోంది. దానిపై ఎవరైనా గొంతెత్తితే చాలు దాడులకు తెగబడుతున్నారు. గత డిసెంబరులో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి పర్యటన సందర్భంగా కట్టిన బ్యానర్లను వైఎస్సార్సీపీ వారు తొలగించడంతో వివాదం తలెత్తింది. ఆ మర్నాడు చల్లా, తదితరులపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. డిసెంబరు 25న నడమిగడదేశిలో టీడీపీ నాయకుడు నవీన్ యాదవ్ ఇంటిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడికి ప్రయత్నించారు. గత ఏడాది డిసెంబరు 4వ తేదీన పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంటి ఆవరణను ధ్వంసం చేశారు.
మాచర్ల నడిబొడ్డున దాడి: ఒకప్పుడు చంబల్ లోయలో బందిపోట్లు చేసే అఘాయిత్యాల గురించి కథలు కథలుగా చెప్పేవారు..! ఇప్పుడు పల్నాడు జిల్లాలోని మాచర్లలో కూడా అధికార పార్టీ నాయకులు అంతకు మించిన దారుణాలకు పాల్పడుతున్నారు. గత డిసెంబరు 16న మాచర్ల పట్టణంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ముందస్తు వ్యూహం ప్రకారం అడ్డుకొని విధ్వంసానికి దిగారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురక కిశోర్ ఆధ్వర్యంలో రాళ్లు, కర్రలు, మారణాయుధాలతో దాడి చేసి... బ్రహ్మారెడ్డి సహా టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని దొరికిన వాళ్లను దొరికినట్టు కొట్టారు. బ్రహ్మారెడ్డి ఇంటికి నిప్పంటించారు. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ పరిశీలకులుగా వెళ్లిన బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న తదితరులపై అదే తురక కిశోర్ మాచర్ల నడిబొడ్డున దాడి చేశారు. ఆ తర్వాత అతనికి మున్సిపల్ ఛైర్మన్ పదవి దక్కింది.