గుంటూరు జిల్లాలో వైకాపా నేత ఒకరు వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిని కులం పేరుతో దూషించటంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్లిపర మండలం మున్నంగికి చెందిన శొంఠి సాంబశివరావు తన భార్యతో కలిసి పొలం పనులకు వెళ్లివస్తుండగా.. రమేష్ రెడ్డి, సందీప్ రెడ్డి అనే యువకులు మద్యం మత్తులో ఆమెను కించపరిచేలా మాట్లాడారు. ఆ యువకులను సాంబశివరావు ప్రతిఘటించారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే బాగుండదని చెప్పాడు. దీంతో వారిద్దరూ సాంబశివరావుపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయిన సాంబశివరావుని ఆ రోజు రాత్రి స్థానిక వైకాపా నేత వేణుగోపాలరెడ్డి తన ఇంటికి పిలిపించారు.
తాను కుర్చీలో కూర్చుని సాంబశివరావుని నేలపై కూర్చోబెట్టాడు. 'నీది కూడా ఓ కులమేనా... నీదేమైనా గొప్ప కులమా.... మా కులం యువకులని ఎదిరించి మాట్లాడతావా?'... అంటూ బెదిరించాడు. అయితే తన భార్య పట్ల అమర్యాదగా మాట్లాడారని సాంబశివరావు బదులిచ్చాడు. ఇష్టం వచ్చినట్లు తిట్టి, కొడుతుంటే మౌనంగా ఎలా ఉండాలని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏం చేస్తావంటూ ఆ పెద్దమనిషి గట్టిగా ప్రశ్నించాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన సాంబశివరావు మంగళవారం కొల్లిపొర పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు. సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొల్లిపొర ఎస్.ఐ.బలరామిరెడ్డి తెలిపారు.