Vejendla Water Wells: ఆ ఊరికి బావులే ఆధారం. చెరువు నుంచి ఇళ్లకు కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా.. ఆ నీరు తాగేందుకు పనికిరాదు. వాసనతో పాటు మురికిగా ఉండటంతో.... వేరే దారి లేక పురాతన బావులకే మోటర్లు బిగించి.. ఇళ్లకు నీటిని తీసుకెళ్తున్నారు. ఆ నీటినే తాగడంతో పాటు వంటలకు వాడుతున్నారు. ఇలా ఏళ్లుగా బావులే ఆ గ్రామ నీటి అవసరాలకు దిక్కయ్యాయి.
చేదబావి చుట్టూ పైపులు, బావిలో మోటార్లు.. ఈ దృశ్యాలు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామంలోనివి. ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయనుకున్న చేదబావులు ఇక్కడ ఇంకా వినియోగంలో ఉండటం ఆశ్ఛర్యమే. అంతేకాదు ఇక్కడి ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు బావినీళ్లే దిక్కయ్యాయి. ఎందుకంటే పంచాయతీ ద్వారా సరఫరా చేసే నీరు ఏ మాత్రం వినియోగానికి ఉపయోగపడకపోవటంతో పురాతన కాలం నాటి నీటి వనరులపైనే గ్రామస్థులు ఆధారపడ్డారు. గ్రామంలోని చెరువు నుంచి పైపు లైన్లు వేసి అన్ని వీధులకు కుళాయిలు ఏర్పాటు చేశారు. అయితే అవి అలంకార ప్రాయమే. నీటిని సరిగా శుద్ధి చేయకుండా పంపింగ్ చేస్తుండటంతో ఆ నీరు పనికిరాదు. కేవలం పశువులు కడుక్కోవటానికి, మరుగుదొడ్లకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. స్నానాలకు సైతం చేదబావిల్లోని నీరే ఆధారమైంది. పంచాయతీ సరఫరా చేసే నీటితో స్నానాలు చేస్తే ఒంటిపై దద్దుర్లు వస్తున్నాయని, దురద పెడుతోందని గ్రామస్థులు తెలిపారు. చేదబావిలు సరిగా నిర్వహణ లేకపోవటంతో కొన్ని పాడైపోయాయి. వాటిని మరమ్మతులు కూడా చేయటం లేదు. కనీసం బావుల్లో బ్లీచింగ్ వేయమని కోరినా అధికారులు స్పందించటం లేదని గ్రామస్థులు అంటున్నారు. అందుకే తాగునీటిని క్యాన్ల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు.