తాడేపల్లిలో సీఎం నివాసం వద్ద గోశాల ప్రాంగణంలో ఉగాది వేడుకలు UGADI CELEBRATIONS AT CM JAGAN HOUSE : రాష్ట్ర ప్రజలకు సంవత్సరం అంతా మంచే జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. దేవుడి ఆశీస్సులు ప్రజలపై మెండుగా ఉండాలని కోరుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద గోశాల ప్రాంగణంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సతీమణి వైఎస్ భారతితో కలసి సీఎం జగన్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీవారి దేవాలయంలో సీఎం జగన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ శోభకృత్ నామ తెలుగు సంవత్సర పంచాంగాన్ని సీఎం ఆవిష్కరించారు. కప్పగంతు సుబ్బరాయ సోమయాజులతో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ దంపతులు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని పంచాంగ కర్త కప్పగంతు సుబ్బరాయ సోమయాజులు తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు పండించే రైతులకు ఈ శోభకృత్ నామ సంవత్సరంలో మంచి లాభాలు వస్తాయని సోమయాజులు అన్నారు.
"రాష్ట్రంలోని ప్రతి అక్కకు, చెల్లికి, అన్నకు, స్నేహితుడికి, అవ్వకి, తాతకి రాబోయే సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని.. దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనసారా కూడా ఆకాంక్షిస్తున్నా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు"-సీఎం జగన్, ముఖ్యమంత్రి
పాడి రైతులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుందని, వ్యవసాయం, ఆర్థిక, విద్యాశాఖల్లో మంచి అభివృద్ది ఉంటుందన్నారు. ఆహార ఉత్పతులతో ముడిపడిన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని ఆయన స్పష్టం చేశారు. సీఎంకు వ్యక్తిగతంగా, పాలనా పరంగా కలసి వస్తుందని తెలిపారు. ఈ ఏడాదిలో విశేష ఫలితాలు వస్తాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత పెరుగుతుందని తెలిపారు. పంచాంగ పఠనం చేసిన సుబ్బరాయ సోమయాజులుని సీఎం జగన్ శాలువాతో సత్కరించారు.
"ఈ సంవత్సరం పేరుకు తగ్గట్టే.. శోభాయమానంగా ఉంటుంది. మంచి ఫలితాలు వస్తాయి. కార్మికులు, కర్షకులు ఈ ఏడాది అంతా లాభదాయకంగా ఉంటుంది. విద్యా, వైద్య, పరిపాలనా రంగంలో మంచి అభివృద్ధి కనబరుస్తారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు పండించే రైతులకు మంచి లాభాలు వస్తాయి. పాడి రైతులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది"-కప్పగంతు సుబ్బరాయ సోమయాజులు, పంచాంగ కర్త
అనంతరం వ్యవసాయ పంచాంగాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. సీఎం దంపతులకు తిరుమల తిరుపతి దేవాలయ ఆస్థాన పండితులు వేద ఆశీర్వాదం అందించారు. సీఎం దంపతులకు మంత్రి రోజా మెమెంటో అందజేశారు. సాంస్కృతిక శాఖ రూపొందించిన క్యాలెండర్‌ను జగన్ దంపతులు ఆవిష్కరించారు. ఉగాది సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ దంపతులు వీక్షించారు.
ఇవీ చదవండి: